ప్రకృతితో చెలగాటం..మన ప్రాణాలకే సంకటం!
ప్రపంచస్థాయి సూచికల్లో మన దేశ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. జీవన ప్రమాణాలనుంచి మిగిలిన ప్రమాణాలదాకా ఎందులో చూసినా మన పరిస్థితి దారుణంగానే ఉంటోంది. అయినా అంతా బాగుందంటూ మేకపోతు గాంభీర్యం. తాజాగా
ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్ టెన్ సిటీల్లో మనమే టాప్. ఎందుకంటే అందులో ఎనిమిది మన దేశంలోనే ఉన్నాయి. చలికాలం సమీపిస్తుండటంతో భారత నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. అదృష్టంకొద్దీ ఈ లిస్టులో దేశ రాజధాని ఢిల్లీ లేదు.
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హర్యానాలోని గురుగ్రామ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. గురుగ్రామ్‌లో ఏక్యూఐ 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269), భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) కాలుష్యంలో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి.
పీల్చే గాలే మనల్ని చంపేస్తోంది. కాలుష్యంతో 2019లో మన దేశంలో 23 లక్షలమంది అకాల మరణం పాలయ్యారు. అందులో 17 లక్షల మంది చెందగా.. వాయు కాలుష్యంతోనే ప్రాణాలు కోల్పోయారు. కాలుష్య మరణాల్లో మన తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. వాయు కాలుష్యంతో చైనాలో 18 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ది లాన్సెట్ కమిషన్ ఆన్ పొల్యూషన్ అండ్ హెల్త్ నివేదిక ప్రకారం కలుషిత గాలి, విషపూరిత రసాయనాలతో దేశ జీడీపీకి ఒక శాతానికిపైగా నష్టం వాటిల్లుతోంది. భారత్‌లోని 93 శాతం ప్రాంతంలో డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల కంటే ఎక్కువగా కాలుష్య సమస్య ఉందనే పరిశోధన ప్రమాదఘంటికలు మోగిస్తోంది.