షర్మిల ఢిల్లీ పాలిటిక్స్

By KTV Telugu On 24 October, 2022
image

ఒక్క నెలలోనే రెండుసార్లు హస్తినకు
కేసీఆర్ సర్కార్ లక్ష్యంగా దూకుడు
కాళేశ్వరంలో అవినీతిపై ఫిర్యాదులు
వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వరుస ఢిల్లీ పర్యటనలతో తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న షర్మిల…హస్తిన పర్యటనతో మరింత కాక పుట్టించారు. కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరంలో అవినీతిపై కేవలం విమర్శలకే పరిమితం అయ్యాయి. కానీ, షర్మిల ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం సంచలనం రేపుతోంది.

శుక్రవారం ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ…కాగ్ ఛైర్మన్ గిరీశ్ చంద్ర ముర్మును కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను షర్మిల కాగ్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఇదే అంశంపై సీబీఐకి ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. ఇలా ఒక్క నెలలోనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి… కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర సంస్థలకు కాళేశ్వరంపై ఫిర్యాదులు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక, తన బాబాయి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి షర్మిల ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివేకా హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరమైన ఘటనగా షర్మిల పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడాలని, సోదరి సునీతకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. ఇటీవల ఏపీలో ఎన్టీఆర్ వర్సిటీ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు చేర్చటాన్ని కూడా షర్మిల వ్యతిరేకించారు.

వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా తెలంగాణలో వైఎస్సార్టీపీని స్థాపించిన షర్మిల రాష్ట్రంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మంగళవారం నిరుద్యోగ దీక్షలతో ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించిన షర్మిల…పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లి మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు, చేరికలు లేకపోవడం వైఎస్సార్టీపీ శ్రేణులను నిరాశపరుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన షర్మిల… అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగుతామని అంటున్నారు.