బ్రిట‌న్‌లో భార‌తీయం..ఇదో అద్భుతం

By KTV Telugu On 25 October, 2022
image

– భార‌తీయుడి స‌మ‌ర్ధ‌త‌కు త‌ల‌వంచిన బ్రిట‌న్‌

అద్భుతం. క‌ల‌లో కూడా ఊహించ‌ని అద్భుతం. దాదాపు రెండు శ‌తాబ్ధాల‌పాటు మ‌న దేశాన్ని బానిస శృంఖ‌లాల్లో బంధించి ఉంచిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓ భార‌తీయుడు ఏల‌బోతుండ‌టం అత్య‌ద్భుతం. అనుకున్నామ‌ని జ‌ర‌గ‌వు అన్నీ…అనుకోలేద‌ని ఆగ‌వుకొన్ని. మ‌న దేశ స్వేచ్ఛ‌ని, ఆర్థిక‌వ‌న‌రుల‌ను శ‌తాబ్దాల‌క్రిత‌మే కొల్ల‌గొట్టిన బ్రిట‌న్‌కి నేడు మ‌న భార‌తీయుడే ఆప‌ద్బాంధ‌వుడ‌య్యాడు. ఆర్థిక‌సంక్షోభంలో కూరుకుపోయి ప‌త‌నం అంచున ఉన్న బ్రిట‌న్‌ని గ‌ట్టెక్కించే బాధ్య‌త‌ను మ‌న మూలాలున్న యువ‌నేత త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకున్నాడు. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిషి సునాక్ ఇప్పుడో అద్భుతంగా క‌నిపిస్తున్నాడు.
ఒక‌ప్పుడు భార‌త్‌ని కొల్ల‌గొట్టి మ‌న స‌మ‌ర‌యోధుల అలుపెర‌గ‌ని వీరోచితపోరాటంతో చివ‌రికి తోక‌ముడిచిన బ్రిట‌న్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఐదేళ్ల‌లో ఆరుగురు ప్ర‌ధానులు మారాల్సివ‌చ్చింది. తెల్ల‌తోలు అహంకారంతో ఒక‌ప్పుడు విర్ర‌వీగిన రాచ‌రిక దేశం ఇప్పుడు త‌న సంర‌క్షణ బాధ్య‌త‌ను ఓ భార‌తీయుడికి అప్ప‌గించ‌డం చ‌రిత్ర ఎప్ప‌టికీ మ‌రిచిపోని క్ష‌ణం. మాజీ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ నీ ముందు నేను నెగ్గ‌లేనంటూ త‌ప్పుకున్నాడు. అహంతో చివ‌రిక్ష‌ణందాకా బ‌రిలోనే ఉన్న పెన్నీ మోర్డాంట్ క‌నీస మ‌ద్ద‌తు కూడా దొర‌క‌క చివ‌రికి చేతులెత్తేయ‌టంతో మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన రిషి సునాక్ బ్రిట‌న్ ప్ర‌ధానిగా ఏక‌గ్రీవ‌మ‌య్యారు.

నెల‌న్న‌ర క్రితం లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌ మధ్య హోరాహోరీ పోరులో చివరికి ట్ర‌స్ గెలిచారు. సునాక్ హెచ్చ‌రిక‌ల‌ను ప‌ట్టించుకోని క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నేత‌లు లిజ్‌కే ప‌ట్టంక‌ట్టారు. కానీ తామెంత త‌ప్పుచేశామో వారికి తెలిసొచ్చింది. త‌న తొంద‌ర‌పాటుతో బ్రిట‌న్‌ని ప్ర‌మాదంలో ప‌డేసిన లిజ్ త‌ప్పుకోవ‌టంతో ఈ దేశాన్ని గ‌ట్టెక్కించే స‌మ‌ర్థ‌త రిషికే ఉంద‌ని అంతా గుర్తించారు. ఓడిపోయిన చోటే రిషి సునాక్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. అంతేకాదు రెండొందల సంవ‌త్స‌రాల బ్రిట‌న్ చ‌రిత్ర‌లో తొలి పిన్న‌వ‌య‌స్కుడైన ప్ర‌ధాని మ‌న రిషి సునాకే కావ‌టం మ‌రో విశేషం. ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 42 సంవ‌త్స‌రాలు.

1980 మే 12న ఇంగ్లాండ్ సౌథాంప్టన్‌లో రిషి సునాక్‌ జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి.. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ నారాయణమూర్తి కూతురు అక్షతాతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.
చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్‌ పార్టీలో రిషిసునాక్ కొంతకాలం ఇంటర్న్‌షిప్‌ చేశారు. 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2015 ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత మ‌రోసారి విజయం సాధించారు.
2019లో కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో బోరిస్‌కు రిషిసునాక్ మద్దతిచ్చారు. బోరిస్‌ ప్రధాని అయ్యాక రిషికి ఆర్థిక శాఖ చీఫ్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు స్వీక‌రించారురు. తన వ్యక్తిత్వం, దూకుడుతో రైజింగ్‌ స్టార్ మినిస్టర్‌గా రిషి సునాక్ గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా ఆయ‌న మ‌రో మెట్టు ఎదిగారు. కేబినెట్‌లో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కరోనా సంక్షోభ సమయంలో బిలియన్‌ పౌండ్ల పథకాలను సునాక్‌ ప్రకటించారు. త‌న‌దైన పాల‌సీల‌తో బ్రిటన్‌ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. బోరిస్‌ జాన్సన్‌ పదవి నుంచి దిగిపోగానే త‌ర్వాతి ప్ర‌ధానిగా రిషి సునాక్ పేరే మొద‌ట వినిపించింది.

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. ఆ సామెతను నిజం చేస్తూ ఓడిన చోటే తిరుగులేని విజేతగా నిలిచారు బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి రిషి సునాక్‌. బ్రిటన్‌ పార్లమెంట్‌లో సునాక్‌కు 193 మంది ఎంపీల మద్దతు ల‌భించింది. ఎంపీగా బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో భ‌గ‌వ‌ద్గీత‌పై ప్ర‌మాణంచేసిన రిషి సునాక్‌కి త‌న పూర్వీకుల స్వ‌దేశం భార‌త్ అంటే అపార‌గౌర‌వం ఉంది. ప్రధానిగా ఎన్నిక‌య్యాక బ్రిటిష్ ప్ర‌జ‌ల‌నుద్దేశించి రిషి చేసిన ప్ర‌సంగం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ గొప్ప అవ‌కాశంతో బ్రిటీష్‌ ప్రజలకు నిరంత‌ర సేవ‌చేస్తాన‌ని రిషి భ‌రోసా ఇచ్చారు. ఈ దేశానికి సేవ చేసేందుకు తన జీవితంలో లభించిన అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నానన్న రిషి సునాక్ విన‌మ్ర‌త‌కు బ్రిట‌న్ ప్ర‌జ‌లు ముగ్దుల‌వుతున్నారు. ఒక‌ప్పుడు మ‌న దేశాన్ని క‌బ‌ళించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇప్పుడు మ‌న భార‌తీయుడు అధినేత కావ‌టం మ‌రో స్వాతంత్య్ర‌ఘ‌ట్టంగా చెప్పుకోవ‌చ్చేమో!