సోనియా ట్రస్టులకు చెక్‌..FCRA లైసెన్సులు రద్దు

By KTV Telugu On 26 October, 2022
image

దాచాలంటే దాగవులే.. ట్రస్టుల ఆటలు సాగవులే!

రాజకీయ కక్షసాధింపేనని కాంగ్రెస్‌ అధినేత్రితో పాటు ముఖ్యనేతలు గొంతుచించుకున్నా చట్టం తన పని తాను చేసుకుపోతోంది. సోనియాగాంధీ ఆధీనంలో నడుస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థలకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్సులపై వేటుపడింది. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌గాంధీ ఛారిటబుల్‌ ట్రస్టు చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర హోంశాఖ వాటి లైసెన్సులు రద్దుచేసింది.

ఐటీ రిటర్న్స్‌లో అక్రమాలు, చైనాతో పాటు ఇతర దేశాలనుంచి అందిన నిధుల దుర్వినియోగం, నగదు అక్రమ చలామణి ఆరోపణలతో కేంద్ర హోంశాఖ ఈ చర్యలు తీసుకుంది. ఆర్‌జీఎఫ్‌, ఆర్‌జీసీటీ రెండు ట్రస్టులకీ సోనియానే అధ్యక్షురాలిగా ఉన్నారు. రాహుల్‌గాంధీ ట్రస్టీగా ఉన్నారు. బీజేపీ నేతల ఆరోపణలను, విచారణ ప్రక్రియను రాజకీయ కుట్రగా కాంగ్రెస్‌ విమర్శించింది. కానీ ఆరోపణలకు తగ్గ ఆధారాలతో కేంద్రం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది.

స్వచ్ఛందసంస్థలు, ట్రస్టులు విదేశీ విరాళాలు స్వీకరించేందుకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ తప్పనిసరి. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్, రాజీవ్‌గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆ కుటుంబం కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు ఈ రెండు సంస్థల మీదా ఆరోపణలు వచ్చాయి. నిజాలు నిగ్గుతేల్చేందుకు 2020లో ఏర్పాటుచేసిన ఆర్థిక, హోంశాఖల అంతర్గత కమిటీ సిఫార్సులతో చివరికి రెండు సంస్థల లైసెన్సులను రద్దుచేశారు.

గాంధీల కుటుంబ ట్రస్టులకు బిల్ అండ్‌ మెలిన్డా గేట్ ఫౌండేషన్ ప్రధాన దాత. 2005-2006 ఆర్థిక సంవత్సరానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి భారీగా విరాళాలు వచ్చాయి. 2020-21 సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్న్స్‌లో ఎలాంటి విరాళాలు స్వీకరించలేదని రెండు ట్రస్టులు డిక్లరేషన్‌ ఇచ్చాయి. అయితే ఒక ఖాతాలో రూ.11.50 కోట్లు, మరో ఎకౌంట్‌లో రూ.13.50 కోట్లను అధికారులు గుర్తించారు. దీంతో తప్పుడు డిక్లరేషన్‌తో పాటు ఇతర అవకతవకలను గుర్తించటంతో లైసెన్సు రద్దుచేశారు. ఈ దెబ్బతో విదేశీ విరాళాలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది పాపం. శకునం చెప్పే బల్లి కుడితిలో పడటమంటే ఇదే!