ఐటి మేడిపండేనా? మెరుపుల వెనుక చీకట్లేనా?

By KTV Telugu On 27 October, 2022
image

ముంచుకొస్తున్న ముప్పుకి సంకేతమా!?

వందలకోట్ల లాభాలు చూపే పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. కొత్తగా ఆఫర్‌ లెటర్స్ లేవు. ఉన్నవాళ్ల ఉద్యోగాలు ఎన్నాళ్లుంటాయో తెలీదు. పైకి చూట్టానికి మాత్రం అంతా బాగానే ఉంది. కానీ ఐటీలో సీట్లకిందికి నీళ్లొచ్చేస్తున్నాయి.
కొత్తగా ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారు డోలాయమానంలో ఉన్నారు. ఆఫర్‌ లెటర్స్‌ ఉన్నా అప్పాయింట్‌మెంట్స్‌ లేకపోవటంతో ఆందోళనపడుతున్నారు.
ఇంత సడెన్‌గా ఐటీ నెత్తిన పిడుగేమీ పడకున్నా కొన్ని కంపెనీలు ‘ముందు’చూపుతో వ్యవహరిస్తున్నాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చేసినట్లు కాదంటున్నాయి. ఎప్పుడో ఇస్తే ఇస్తామన్నట్లు సంకేతాలిస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే ఇచ్చిన లెటర్లు వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తున్నాయి. ఆఫర్ లెటర్లు పొందినవారిని వడపోసి తగ్గించే ప్రయత్నాల్లో మరికొన్ని ఐటీ కంపెనీలున్నాయి. ఐటీలో మునుపెన్నడూ చూడని పరిస్థితి ఉద్యోగులను కలవరపెడుతోంది.
ఒక్కటిమాత్రం నిజం. ఐటీ రంగం పైకి కనిపించేంత బలంగానైతే లేదు. దిగ్గజ కంపెనీలు కూడా ఆఫర్‌ లెటర్స్‌ విషయంలో దాగుడుమూతలాడటం చూస్తుంటే భవిష్యత్తు భయపెడుతోంది. ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చారు కాబట్టి వెళ్లి సీట్లో కూర్చోలేరు. కంపెనీ తలుపుతెరిస్తేగానీ అది సాధ్యంకాదు. మా సంస్థ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా మీ క్వాలిటీస్‌ లేవనే కారణంతో ఆఫర్‌ లెటర్స్‌ తిరస్కరించవచ్చు. అయితే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో అకడమిక్‌ హిస్టరీ, మార్కులు, ప్రతిభని పరిగణనలోకి తీసుకొని ఎంపికచేసి ఇప్పుడు మొండిచేయి చూపటాన్ని అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సమీపభవిష్యత్తులో ఆర్థికమాంద్యం ముంచుకొచ్చేలా ఉంది. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా జాగ్రత్తపడుతున్నాయి. ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని మేటా పనితీరు ప్రాతిపదికగా 12 వేల మందిని తొలగిస్తోంది. లక్షా 15 వేలమంది ఉద్యోగులున్న ఇంటెల్‌ అంతర్జాతీయంగా ఐదోవంతు మ్యాన్‌పవర్‌ని తీసేయాలని నిర్ణయించుకుంది. ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ రెండున్నర వేల మందిని సాగనంపుతోంది. చివరికి గూగుల్‌ కూడా కొత్త రిక్రూట్‌మెంట్‌పై బ్యాన్‌ పెట్టింది. ఐటీలో ఆన్‌బోర్డింగ్‌ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం సంకేతాలే కారణమంటున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకులతో కొత్త ప్రాజెక్ట్‌లు తగ్గటం కూడా ఈ పరిస్థితికి పరోక్ష కారణమవుతున్నాయి.