నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కోసం జరిగిన డీల్ తెలంగాణలో కలకలం సృష్టించింది. బేరసారాలు జరుగుతుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి కుట్రను బట్టబయలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఎమ్మెల్యేల కొనుగోలు కోసం జరిపిన డీల్‌లో మొత్తం ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు. ఆ ముగ్గురిలో ఒకరు ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, మూడో వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ ప్రైడ్ హోటల్ యజమాని నందకుమార్. సతీశ్ శర్మ, సింహ యాజులను నందకుమారే హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో ఢిల్లీ పెద్దల చేత మాట్లాడించారు. అయితే ఇంత పెద్ద డీల్‌ను కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈ నందకూమార్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ? ఇదంతా టీఆర్‌ఎస్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేయించిందని, దానికి నందకుమార్ ను ఉపయోగించుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో నందకుమార్ టీఆర్‌ఎస్ ముఖ్య నేతతో కలిసి దిగినట్లు కనిపిస్తోంది. అలాంటి వ్యక్తి బీజేపీ తరపున ఎలా డీల్ సెట్ చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీని ఇరికించడానికి టీఆర్‌ఎస్ నందకుమార్‌ను పావుగా వాడుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.