అమ్మా పెట్టదు..అడుక్కోనివ్వదు అనుకోవచ్చా!
ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ. ఓట్లేస్తే చాలు ప్రతీదీ ఫ్రీ అన్నట్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ‘సంక్షేమ’పాలన సాగిస్తున్నాయి. మౌలికవసతులకంటే వ్యక్తిగత లబ్ధిచేకూర్చడానికే కొన్ని ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అప్పుచేసి పప్పుకూడు తింటున్నాయి. రుణభారం పెరిగిపోతున్నా, కొత్త అప్పులు పుట్టడం కష్టమవుతున్నా సంక్షేమం పేరుతో ఉచిత పథకాలను మాత్రం కొనసాగిస్తున్నాయి. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఉచితపథకాలు అనుచితం అంటోంది. ఆర్థికవ్యవస్థకు ఇవి గుదిబండగా మారతాయంటోంది. ఎన్నికల్లో రాజకీయపార్టీల ఉచిత పథకాలను కొంతకాలంగా ప్రధాని నేరుగానే తప్పుపడుతున్నారు.
పన్నుల సొమ్ముని ఉచిత పథకాలకు ధారపోయడంపై టాక్స్ పేయర్స్ ఆవేదన చెందుతున్నారని ప్రధాని ఈమధ్య వ్యాఖ్యానించారు. దీనిపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విపక్షపార్టీలు గుర్రుమంటున్నా మోడీ మాత్రం అదే మాటమీద ఉంటున్నారు. రాజకీయపార్టీల ఉచిత హామీలపై బీజేపీ వైఖరి కూడా కచ్చితంగానే ఉంది. తన వైఖరిని స్పష్టంచేస్తూ ఆపార్టీ ఈసీకి లేఖ రాసింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలకి, సంక్షేమానికి మధ్య స్పష్టమైన తేడా ఉందని బల్లగుద్ది చెబుతోంది భారతీయ జనతా పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘానికి అదే విషయం స్పష్టంచేసింది.
సంక్షేమం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అందరి హితంకోసం తీసుకునే విధానపరమైన నిర్ణయం. ఉచిత పథకాలు మాత్రం కేవలం ఓటర్లను ఆకర్షించడానికి చేపట్టేవే. ఫ్రీ స్కీములు కాకుండా ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించడంపై దృష్టి సారించాలని బీజేపీ కుండబద్దలు కొట్టింది. ఎన్నికల హామీల అమలు ఆర్థికంగా ఎలా సాధ్యమనే విషయాన్ని పార్టీలు తెలియజేయాలనే ఈసీ ప్రతిపాదనను బీజేపీ స్వాగతించింది.
బీజేపీ వైఖరిని తప్పుపడుతున్న కొన్ని రాజకీయపక్షాలు ఆ పార్టీ పాలనలోని రాష్ట్రాల సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్లో బీజేపీని గెలిపిస్తే కుటుంబానికి ఏటా రెండు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఓ మంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని ఎత్తిచూపుతున్నాయి. మధ్యప్రదేశ్, హర్యానాల్లో ఓటేస్తే ఇంటికో ఆవుని ఉచితంగా ఇస్తామని బీజేపీ గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. నిజమేగా…ముందు తన పాలనలోని రాష్ట్రాల్లో ఉచితాల జోలికి వెళ్లకుండా అప్పుడు అందరికీ హితోపదేశం చేస్తే బాగుంటుందేమో!