మునుగోడు ఉప ఎన్నిక పక్కకెళ్లిపోయింది…

By KTV Telugu On 27 October, 2022
image

కొన్ని రోజులుగా వాడివేడిగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచార పర్వం ఒక్కసారిగా పక్కకెళ్లిపోయింది.
రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. మీడియా కూడా ఈ వార్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో మునుగోడులో ప్రచార విశేషాలు పక్కకెళ్లిపోయాయి. తమ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంటే, మునుగోడులో ఓడిపోతామ‌నే భ‌యంతోనే టీఆర్ఎస్ ఇలాంటి నాటకాలకు పాల్ప‌డుతోంద‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.
పోలీసుల వద్ద డీల్‌కు సంబసంధించిన ఆడియో, వీడియో టేపులతో పాటు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు దీనికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆర్‌దేనని ఆరోపించారు బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. తాను రేపు ఉదయం యాదాద్రికి వెళ్తున్నానని, దమ్ముంటే కేసీఆర్‌ కూడా రావాలని సవాల్‌ చేశారు. ఈ కుట్రలో తన పాత్ర ఏమీ లేదని కేసీఆర్‌ ప్రమాణం చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో తమకెలాంటి సంబంధం లేదని బీజేపీ ఇతర ముఖ్య నేతలు కూడా మాట్లాడారు. మరోవైపు బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దాంతో
మునుగోడు ఉప ఎన్నిక ప్రచార విశేషాలు ప‌క్క‌కు పోయి, ఎమ్మెల్యే కొనుగోలు డీల్‌ తెర‌పైకి వచ్చింది.