తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన మాట నిలబెట్టుకున్నారు. యాదాద్రి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని దేవుడి పాదాల దగ్గర తడి దుస్తులతో ప్రమాణం చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నాయకులకు గానీ, పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టీఆర్ఎస్ తమమీద తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. లక్ష్మీనరసింహస్వామి తమ ఇలవేల్పు అని, తాను చేసినట్లుగానే సీఎం కేసీఆర్ కూడా స్వామివారి ముందు ప్రమాణం చేయాలని అన్నారు. మొయినాబాద్ పామ్హౌస్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగ్గురు వ్యక్తులు బేరసారాలు అడుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్ బీజేపీ మాధ్య మాటల యుద్ధం మొదలైది. డబ్బుతో తమ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది అని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అయితే ఇదంతా ఒక డ్రామా అని, తమపై బురద చల్లడానికే ఆడుతున్న నాటకం అని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ముందు ప్రమాణం చేస్తానని, దమ్ముంటే కేసీఆర్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ చేశారు. అన్నట్లుగానే శుక్రవారం ఉదయం ఆయన స్వామి సమక్షంలో ప్రమాణం చేశారు. దీనిమీద టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.