సింక్‌తో ఎంట్రీ..కడిగేస్తాడా? కంపుకొట్టిస్తాడా?
దాగుడుమూతల దండాకోర్..మస్క్ చేతికి ట్విటర్!
దాగుడుమూతలకు తెరపడింది. కొంటాడో లేదోనన్న మీమాంస వీడిపోయింది. దిగ్గజ సోషలమీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ ప్రపంచ కుబేరుడి చేతికొచ్చింది. ట్విటర్‌ని 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలుచేశారు ఎలాన్‌మస్క్. శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ హెడ్క్వార్టర్లోకి వెరయిటీ ఎంట్రీతో అదరగొట్టేశాడు. సింక్‌ని చేతబట్టుకొని ఆఫీస్ లాబీలో తిరుగుతున్న వీడియోని ఎలాన్‌మస్క్ ట్విటర్లో షేర్ చేశారు. తన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్‌లో హోదాను చీఫ్ ట్విట్‌గా మార్చుకున్నారు. ఏప్రిల్‌లో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈనెల 28కల్లా ట్విటర్ కొనుగోలు పూర్తిచేయాలని అమెరికా కోర్టు ఎలాన్ మస్క్‌కు గడువిచ్చింది. దీంతో ఆరోజే ఆఫీసులోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చాడు మస్క్. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ట్విటర్‌ని హస్తగతం చేసుకున్న మస్క్ ‘పక్షికి విముక్తి కలిగింది’ అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించి 100శాతం యజమాని అయ్యారు మస్క్. వాస్తవానికి ఏప్రిల్‌లోనే ట్విటర్ కొనుగోలు ఒప్పందం ఖరారైంది. కానీ ఆర్నెల్ల తర్వాత అది కార్యరూపం దాల్చింది. జులైలో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్‌మస్క్ ప్రకటించడంతో వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. చివరికి కోర్టు విధించిన గడువుకల్లా ఎలాన్‌మస్క్ డీల్ చేశారు. ట్విటర్‌ని సొంతం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఉన్నత స్థానాల్లో ఉన్నవారిపై మస్క్ వేటువేశారు. సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ఐదేళ్లక్రితం ట్విటర్లో చేరిన సీఎఫ్ఓ నెడ్ సెగల్, పదేళ్లనుంచి ఉన్న జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్‌లను ఇంటికి సాగనంపారు. ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్‌మస్క్ చేసిన ప్రకటనను కోర్టులో సవాల్ చేయడంలో కీలకపాత్ర పోషించినవారిపై వచ్చీరాగానే మస్క్ కొరడా ఝుళిపించాడు. మస్క్ ఎంట్రీతో ట్విటర్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఉద్యోగుల సంఖ్యని తగ్గిస్తానని మొదటే మస్క్ సంకేతాలిచ్చారు. కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించే ఆలోచన చేశారు. కానీ ట్విటర్ హెడ్ క్వార్టర్స్‌ని సందర్శించాక 75శాతంమందికి ఉద్యోగభద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. అంటే ఓ 25శాతం మందిని తీసేయడం ఖాయమన్నమాట! మొత్తానికి మస్క్ చేతిలోని పిట్ట మున్ముందు ఎలాంటి కూత పెట్టబోతోందో!