మేము విన్నాం..మేము ఉన్నాం.. స్వామీజీ భరోసా!

By KTV Telugu On 28 October, 2022
image

అంతా ‘ఆయన’ చూసుకుంటారు.. ఎవరాయన?
ఫాంహౌస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ వెనుక అంతులేని కథ

లేదు లేదంటూనే అదే జరిగింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేదే కమలం పాలసీ. ఎక్కడోచోట మొదలుపెడితేనేగా చివరికి శివసేనకు ఎర్త్‌పెట్టిన ఏక్‌నాథ్‌షిండేలాంటి వాళ్లు దొరికేది. ముందో ముగ్గురో నలుగురో లైన్లోకొస్తే మిగిలినవారిదేముంది.. గొర్రెలమందలా కంచె దూకించేయొచ్చు. మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్‌ తీసిన సిన్మా అట్టర్‌ఫ్లాప్‌ అంది బీజేపీ. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాదాద్రిలో మా మోడీ మీదొట్టు అన్నట్టు ప్రమాణం కూడా చేశారు. కానీ నిప్పులేందే పొగరాదు..ఎక్కడి ఢిల్లీ లాబీయింగ్‌ స్వామి, ఎక్కడి హైదరాబాద్‌ నందు. గొప్పోళ్ల గోత్రాలు అట్టానే ఉంటాయ్‌ మరి!
మెయినాబాద్‌ ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు వచ్చిన ‘బీజేపీ టీం’ని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు, ఓ మీడియేటర్‌తో పాటు మరో ఇద్దరు స్వాములు. కొన్ని గంటలుగా మీటింగేశారు. పోలీసులు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కి పంపి ఆ ముగ్గురినీ ఇంటరాగేట్‌ చేశారు. కానీ కోర్టు బలమైన ఆధారాలు లేవనే కారణంతో రిమాండ్‌కి నిరాకరించింది. దీంతో టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ తుస్సుమందని కమలనాథులు రివర్స్‌ అవుతుంటే అమ్ములపొదిలోని ఆడియో అస్త్రాన్ని టీఆర్‌ఎస్‌ బయటికి తీసింది.
కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న రామచంద్రభారతి స్వామీజీతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫోన్‌ సంభాషణ అది. కాన్ఫరెన్స్‌లో ఉన్నదేమో నందకుమార్‌ అలియాస్‌ నందు. నేను ప్లస్‌ ముగ్గురం రెడీగా ఉన్నాం మీదే ఆలస్యమని రోహిత్‌రెడ్డి చెబుతుంటే మిగిలినవారికోసం కూడా ట్రైచేయండని అవతలినుంచి సందేశం. 25 గ్రహణం కాగానే కూర్చుని మాట్లాడుకుందామని డిసైడ్‌. వన్‌, టూలతో మాట్లాడటం అయిపోయిందని, కేంద్రంలో కీలకమైన వ్యక్తి (సంతోష్‌) అంతా చూసుకుంటారని రామచంద్రభారతి చెప్పుకొచ్చారు. ఈడీ, ఐటీ ఏవీ మీ జోలికి రావని, సెక్యూరిటీ పరంగా ఇబ్బంది లేకుండా తాము చూసుకుంటామనే భరోసా ఇచ్చారు.
పైలెట్‌ రోహిత్‌రెడ్డి బీజేపీ కేంద్రపెద్దలతో టచ్‌లో ఉంటే టీఆర్‌ఎస్‌ గ్రహించి కోవర్టుగా మార్చుకుందా? లేకపోతే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే ఇలా జరుగుతోందని పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారా? బీజేపీ ఆపరేషన్‌లతో టీఆర్‌ఎస్‌ అందరి ఫోన్లు ట్యాప్‌ చేస్తోందా? తన వ్యవహారం బయటపడటంతో పైలెట్‌ రోహిత్‌రెడ్డి అనివార్యంగా తన ఫాంహౌస్‌లోనే స్టింగ్‌ ఆపరేషన్‌కి ఒప్పుకున్నారా? ఎన్నో సందేహాలు, ఎన్నో చిక్కుముడులు. ఈ ఆడియోని చూపిస్తూ టీఆర్‌ఎస్‌ ఇదిగో సాక్ష్యం అంటోంది. మరా సాక్ష్యం చట్టం ముందు నిలుస్తుందా? టీఆర్‌ఎస్‌ వాదన గెలుస్తుందా?