పిక్చర్ అభీ బాకీ హై..

By KTV Telugu On 29 October, 2022
image

ఆడియోలు బయట పెట్టడంతో ఆట అయిపోలేదా.

ఇంకా ఆడియో, వీడియోలు ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు ఎందుకు చెబుతున్నారు… బీజేపీ వేచి చూసే ధోరణి ఎందుకు పాటిస్తోంది. బీజేపీ దగ్గర కూడా టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టే సమాచారం ఉందా…

ఆడియో లీకులతో టీఆర్ఎస్ పైచేయి
వంద కోట్లు ఆఫర్ చేసినట్లుగా ఆడియో సంభాషణలో
బీఎల్ సంతోష్ పేరు ప్రస్తావించిన రామచంద్రభారతి
రిమాండ్ రిపోర్టులో సునిల్ బన్సల్ ప్రస్తావన. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పూట పూటకు రంగు మారుతోంది. ముగ్గురు నిందుతుల రిమాండ్ ను న్యాయమూర్తి తిరస్కరించడంతో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలిందని భావిస్తున్న బీజేపీ గొంతులో పచ్చివెలక్కాయపడే సీన్ శుక్రవారం ఆవిష్కృతమైంది. టీఆర్ఎస్ నేతలు చాలా తెలివిగా రెండు ఆడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. 27 నిమిషాల నిడివి ఉన్న రెండో ఆడియాలో అనేక సంచలన అంశాలున్నాయి. పార్టీ మారినందుకు నజరానాగా పైలట్ రోహిత్ రెడ్డికి 100 కోట్లు ఇప్పించేందుకు రామచంద్రభారతి సిద్ధంగా ఉన్నట్లు ఆ ఆడియోలో రికార్డయ్యింది. పైగా ఆయన పదే పదే బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరు చెబుతున్నారు. బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉండే తుషార్ అనే వ్యక్తి పేరు కూడా ప్రస్తావనకు వస్తూనే ఉంది. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరో పది మంది వరకు మాజీలను లాక్కోవాలని ప్లాన్ చేసినట్లుగా ఆడియోలో వినిపించింది. తెలంగాణ పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కూడా అదే అంశాన్ని రాశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ కు రామచంద్రభారతి చేసిన ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ కూడా రిమాండ్ రిపోర్టుకు జతపరిచారు.

మౌనంగానే కేసీఆర్ వ్యూహాలు
ప్రజాకోర్టులో బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు.
మునుగోడు సభలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు.
టీఆర్ఎస్ దగ్గర మరిన్ని ఆడియోలు, వీడియోలు…

నిందితులు ముగ్గురి రిమాండ్ ను కోర్టు తిరస్కరించినా.. టీఆర్ఎస్ పెద్దగా టెన్షన్ పడటం లేదు. మెల్లగా ఆడియోలు లీక్ చేస్తోంది. కోర్టుకు సమర్పించకుండా సోషల్ మీడియాలో లీకులు ఇవ్వడం కూడా పెద్ద వ్యూహమే. ఎందుకంటే ఏ విషయాన్ని కోర్టులు అంత త్వరగా తేల్చవు. ఈ లోపు పుణ్యకాలం అయిపోతుంది. అందుకే ప్రజాక్షేత్రంలోనే బీజేపీని పలుచన చేయాలనికేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆడియోలు సోషల్ మీడియా నుంచి పేపర్లు, టీవీ ఛానెళ్లకు చేరితే వాటికి విస్తృత ప్రచారం వచ్చి బీజేపీ అసలు రంగు బయటపడుతుందని టీఆర్ఎస్ నమ్మకం. పైగా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. ఇటీవలే మహారాష్ట్రలో మూకుమ్మడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఉద్ధవ్ ఠాక్రేను గద్దే దించారు. ఇక నిందితులు మాట్లాడుకున్న మరో రెండు మూడు ఆడియోలు తమ దగ్గర పదిలంగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వాటిని బయట పెడతామంటున్నారు. ఆదివారం మునుగోడు బహిరంగ సభలో కేసీఆర్ అనేక సంచలన అంశాలు బహిర్గతం చేయబోతున్నట్లు టీఆర్ఎస్ నేతలు అంటున్నారు..

మాటల యుద్ధానికి సిద్ధంగా లేని టీఆర్ఎస్
ప్రస్తుతానికి డిఫెన్స్ లో ఉన్న బీజేపీ.
త్వరలోనే బీజేపీ నుంచి సంచలనాలు విడుదలవుతాయని సమాచారం.
కమలం పార్టీ దగ్గరా ఆడియోలున్నాయా…

బీజేపీలో బండి సంజయ్, రఘనందన్ రావు లాంటి ఒక్కరిద్దరు నేతలు ఎదురు దాడికి దిగుతున్నాయి. వంద కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో, నగదు ఎక్కడ దాచారో తేల్చాలని రఘునందన్ రావు… హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ప్రస్తుతానికి బీజేపీ డిఫెన్స్ లో ఉంది. టీఆర్ఎస్ ఆట పూర్తయ్యిన తర్వాత తమ గేమ్ మొదలు పెట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు కొందరు రాష్ట్ర నేతలు అంటున్నారు. అంతవరకు సంయమనం పాటించాలని రాష్ట్ర శ్రేణులను ఆదేశించారు. పైగా రాష్ట్ర శాఖ ప్రమేయం లేకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటామని రామచంద్రభారతి చెబుతున్నట్లు లీకైన ఆడియో టేపులో ఉంది. అందుకే బండి సంజయ్ ధైర్యంగా యాదాద్రికి వెళ్లి ప్రమాణం చేశారు. మునుగోడు పోలింగ్ పూర్తయ్యే వరకు ఆగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. బీజేపీ దగ్గర కూడా కొన్ని ఆడియో, వీడియోలు ఉన్నాయని సమయం వచ్చినవ్పుడు బయట పెడతారని చెబుతున్నారు. ఆ ఆడియోల్లో కూడా రామచంద్రభారతి, నందు వాయిస్ లు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రామచంద్రభారతి అనేక పర్యాయాలు హైదరాబాద్ వచ్చి వెళ్లారని….. నందు ఆతిథ్యంలో ఏదో జరిగిందని బీజేపీ అంటోంది. వాళ్ల దగ్గరున్న సమాచారం బయట పడితేనే అసలు సంగతి అర్థమవుతుంది మరి…..