నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలకు సంబంధించిన కేసులో శనివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్హవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులు పార్టీ మారితే డబ్బులు, పదవులు ఇస్తామంటూ బేరాలాడినట్టు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజులు పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురుని రిమాండ్ కు తరలించేందుకు హైకోర్టు అనుమతిస్తూ, ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ ను కొట్టివేసింది. పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్ ను అనుమతించింది. ప్రస్తుతం బయట ఉన్న నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నిందితులను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసుపై విచారణ జరపకుండా ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… మునుగోడు ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు ఈ కేసును విచారించకుండా స్టే విధించింది. అప్పటి వరకు విచారణను జరపవద్దని ఆదేశించింది. అయితే నిందితుల రిమాండ్ పై స్టే ఉండదని చెప్పింది. ఈ కేసులో తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆపరేషన్ లో ఆయనే కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చారు. ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. 4 ప్లస్ 4 భద్రతను కల్పించారు.