రాహుల్ జోడోయాత్రలో మెరిసిన పూనం కౌర్.. మునుగోడు ఉపఎన్నిక వేళ కీలక పరిణామం.. మునుగోడులో అధికంగా ఉన్న చేనేతలు…
రాహుల్ గాంధీపై పూనం ప్రశంసల జల్లు… మునుగోడు ఉపఎన్నిక వేళ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్, బీజేపీల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సందర్భంలో…రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి పట్టింపు కరువయ్యింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోనే కొనసాగుతున్నా…అనుకున్నంత మైలేజీ రావడం లేదు. దీంతో, అనూహ్యంగా సినీనటి పూనం కౌర్ రాహుల్ గాంధీ యాత్రలో మెరవడం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ యాత్రలో పాల్గొన్న పూనంకౌర్, దాదాపు 15నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. రాహుల్ గాంధీ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని పూనమ్ ప్రశంసించారు. చేనేత కార్మికులు, మహిళల సమస్యలపై ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు.
పూనమ్ కౌర్ ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు కోరుతూ జరుగుతున్న ఉద్యమంలో తాను పాల్గొంటున్నట్లు పూనం పేర్కొంది. ఎంపీల సంతకాలు సేకరించే కార్యక్రమంలో భాగంగానే, రాహుల్ గాంధీని కలిసినట్లు పూనం చెబుతున్నారు. ఖాది వస్త్రాలకు, కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని… నిత్యం చేనేత చీరలను ధరిస్తున్న సోనియా గాంధీ అంటే తనకు ఇష్టమని పూనమ్ తెలిపారు . ఈ సందర్భంగా త్వరలో సోనియాతో పూనమ్ భేటీ కావాలంటూ రాహుల్ సూచించటం కాంగ్రెస్ లో ఆసక్తి కర చర్చ మొదలైంది. పూనమ్ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెబుతున్నప్పటికీ, ఆమెను ఒప్పించి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ఆలోచనల్లో నేతలు ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.
మునుగోడులో గౌడ, ఎస్సీ సామాజికవర్గం తర్వాత పద్మశాలీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈనేపథ్యంలో పూనమ్ కౌర్ రాహుల్ గాంధీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చేనేత ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని ఆమె పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పూనమ్ డిమాండ్ చేశారు. నేతన్నలను ఆకట్టుకునేందుకే…రాహుల్ యాత్రలో పాల్గొనాలని పూనమ్ కు కాంగ్రెస్ కబురు పంపినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన పూనం కౌర్…అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఆమె సినిమాలకు దూరమైంది. ఇండస్ట్రీలో ఓ వ్యక్తి కారణంగా చుట్టుముట్టిన వివాదం… ఆమెను సినిమాలకు దూరం చేసిందనే ప్రచారం ఉంది.