మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి నోటికి ఈసీ తాళం..?

By KTV Telugu On 30 October, 2022
image

వార్నింగులిస్తే ఈసీ ఊరుకుంటుందా?
48గంట‌లు మంత్రివ‌ర్యుడి నిర్బంధ మౌన‌వ్ర‌తం….
మామూలుగానే నేత‌ల నోళ్ల‌కు హ‌ద్దుండ‌దు. సిన్మాల్లో ఏ అశ్లీల దృశ్యాలో, అభ్యంత‌క‌ర డైలాగులో ఉంటే క‌ట్ చేయ‌డానికి సెన్సారోళ్ల చేతిలో క‌త్తెర‌న్నా ఉంటుంది. నాయ‌కుల‌కు అలాంటిదేమీ లేదుగా..న‌రంలేని నాలుక‌తో ఏద‌న్నా మాట్లాడేయొచ్చు. తిట్టొచ్చు, బెదిరించొచ్చు, ప్ర‌లోభ‌పెట్టొచ్చు. ఇజ్జ‌త్‌కా సవాల్‌గా మారిన మునుగోడులాంటి ఉప ఎన్నిక వ‌స్తే నేత‌లు ఎంత‌కైనా తెగించేస్తారు. సామ‌దాన భేద దండోపాయాల్లో దేనినైనా వాడేస్తారు. ఓట్ల‌కోసం కాళ్లు ప‌ట్టుకుంటారు. తేడావ‌స్తోంద‌నుకుంటే గొంతు ప‌ట్టేసుకుంటారు.
మునుగోడు ఉమ్మ‌డి న‌ల్గొండ‌జిల్లాలో ఉంది. దీంతో మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి భ‌విష్య‌త్తుకు ఈ ఎన్నిక ఓ ప‌రీక్ష‌గా మారింది. ఊరికో ఎమ్మెల్యేకి బాధ్య‌త‌లిచ్చినా ఓవ‌రాల్‌గా ఆయ‌నే జ‌వాబుదారీ. అందుకే ఆయన హార్ట్‌బీట్ పెరిగింది. బ్ల‌డ్‌ప్రెజ‌ర్ క్ష‌ణ‌క్ష‌ణం పెరుగుతోంది. ఆ టెన్ష‌న్‌లో ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే అర్ధంకావ‌డం లేదు. కానీ ఎంత వ‌దిలేసినా అప్పుడ‌ప్పుడూ మేమున్నామ‌ని చెప్ప‌డానికి ఓ వ్య‌వ‌స్థ ఉందిగా. మంత్రిగారి మాట‌లు కోట‌లు దాటేస‌రికి ఎన్నిక‌ల క‌మీష‌న్ స్పందించింది. మంత్రి ఇచ్చిన వివ‌ర‌ణ సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌టంతో ఆయ‌న‌పై 48గంట‌ల ఆంక్ష‌లు విధించింది.

రూ.2వేల పెన్షన్ కావాలా వద్దా.. రైతు బంధు, 24 గంటల కరెంట్, దివ్యాంగులకు పెన్షన్ వంటి స్కీములు అమలు కావాలంటే కేసీఆర్‌కే ఓటేయాలి. అవ‌న్నీ ఆగిపోవాలంటే మోడీకి ఓటేయాల‌ని అమాత్యుల‌వారు సెల‌విచ్చారు. బ‌హిరంగ‌స‌భ‌లో మైకు అదిరేట‌ట్టు ఇన్ని డైలాగులు వ‌దిలాక ప్ర‌త్య‌ర్థులు ఊరుకుంటారా! బీజేపీనేత క‌పిల‌వాయి దిలీప్‌కుమార్ దీనిమీద ఈసీకి ఫిర్యాదుచేశౄరు. దీంతో మంత్రివ‌ర్యులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడుతూ ఈసీ నోటీసులిచ్చింది. మంత్రి జగదీష్ రెడ్డి వివరణ ఇచ్చారు. కానీ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడేసి నా ఉద్దేశం అది కాదంటే కుదురుతుందా!

మంత్రి జగదీష్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించింది. 29వ‌తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 48 గంటల పాటు మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి ఎలాంటి ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. మీడియా సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూ లలో కూడా పాల్గొన‌డానికి వీల్లేద‌ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. స్కీంల‌కోసం సొంత జేబుల్లోంచి ఖ‌ర్చుపెడుతున్న‌ట్లు నేత‌ల బిల్డ‌ప్పులు. నిజంగా మేలు చేశామ‌నుకుంటే జ‌న‌మే ఓట్లేస్తారు. భ‌యంతో భుజాలు త‌డుముకోవ‌డం ఎందుకో!