ఓటు హక్కును వినియోగించుకుందాం… భవిష్యత్తు తరాలను కాపాడదాం.

By KTV Telugu On 31 October, 2022
image

Right to vote

రాజ్యాంగమిచ్చిన హక్కు
ప్రపంచ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ
నోటుకు విక్రయించకుండా వినియోగించాల్సిన బాధ్యత
అందరికీ సమానంగా అందే ఏకైక తాయిలం

స్వాతంత్ర్యం మనకిచ్చిన ఏకైక ఆయుధం ఓటు. రాజ్యాగం ప్రతీ ఒక్కరికీ కల్చించిన హక్కు అది. మనకు నచ్చిన నేతలు, మనం మెచ్చిన పార్టీలు అధికారంలోకి రావడానికి మనం ప్రయోగించే వజ్రాయుధం ఓటు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందనేందుకు నిలువెత్తు సాక్ష్యం ఓటు. నాలుగు నోట్లకు మను ఓటును అమ్ముకోకుండా సమర్థుడైన అభ్యర్థికి ఓటు వేస్తేనే దేశం దారి తప్పకుండా ఉంటుంది. ఆస్తులు, అంతస్థులు.. కులగోత్రాల వ్యత్యాసం చూపించకుండా అందరికీ సమానంగా అందే ఏకైక తాయిలం కూడా ఓటే …

ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు నిండితే ఓటు హక్కు
దేశ చరిత్రను మార్చేయ్యగల ఆయుధం
రాజకీయ తంతుగా మారడం దౌర్భాగ్యం
ఎవరోకరికి వేస్తే సరిపోతుందనుకునే తత్వం

భారత రాజ్యాంగం 326 ప్రకారం 18 ఏళ్లు నిండితే ఓటు హక్కు వస్తుంది. వయోజన ఓటింగ్ వయసును చాలా కాలం క్రితం 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. టీనేజ్ యువతకు ఓటు హక్కు కల్పించాలన్న నిర్ణయం సహేతుకమే అయినా ప్రజలు తమ బాధ్యతను అర్థం చేసుకోవడం లేదు. దేశ చరిత్రను మార్చెయ్యగల ఆయుధంగా కాకుండా యథాలాపంగా ఒక సారి వేస్తే పోలే అన్నట్టుగా తయారైందీ పరిస్థితి. ఫ్యాషన్ కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వాళ్లు కూడా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు, ఉప పోరు జరిగినప్పుడు అదో రాజకీయ తంతుగా మారిందే తప్ప… దీర్ఘకాలిక ప్రభావాలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఓటు హక్కును ఎన్నికల ప్రక్రియగానూ, రాజకీయ తంతుగానూ పరిగణించినంత కాలం దానితో పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయడాన్ని తమ కర్తవ్యంగా భావించాలి..

డబ్బులు వెదజల్లుతున్న పార్టీలు
మన కులం, మనం మతం అంటూ లెక్కలు
ప్రజలను అయోమయంలోకి నెట్టే పార్టీలతో జరభద్రం
ఎన్నికల టైమ్ లో వేషగాళ్లతో జాగ్రత్త

రాజకీయ పార్టీల దగ్గర డబ్బు మూలుగుతోంది. ఎన్నికల టైమ్ లో నోట్ల కట్టలు బయటకు తీసే పార్టీలు ఓటు కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నాయి. ఎంతైనా తీసుకోండి.. మాకే ఓటు వేయండన్నట్లుగా వ్యవహరిస్తున్న పార్టీలు గెలిచిన తర్వాత అంతకు పదింతలు సంపాదనపైనే దృష్టి పెడతాయని మరిచిపోకూడదు. అందుకే డబ్బులిచ్చే పార్టీలను కాకుండా… ఓటర్ల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం పనిచేసే పార్టీలకే ఓటెయ్యాలి. మనోడు, మన కులపోడు. మన హిందువు, మన ముస్లిం అన్నట్లుగా కాకుండా పార్టీలు, అభ్యర్థుల మేనిఫెస్టోలు, వారి ట్రాక్ రికార్డ్ ను చూసి ఓటెయ్యాలి. విశాల జనహితాన్ని గుర్తించి ఓటు వేయాలి, ఎన్నికల టైమ్ లో మాత్రమే జనం దగ్గర ప్రత్యక్షమయ్యే వేషగాళ్లు, కల్లబొల్లి కబుర్లతో జనాన్ని మోసగించే వినాయకులకు అస్సలు ఓటెయ్యకూడదని గుర్తించాలి,.

ఇతరులకు సూక్తులు చెప్పేవారితో లేదు ప్రయోజనం
డబ్బుకు అమ్ముడుపోయే నాయకుడెవ్వరో అర్థం చేసుకోండి
ఒక ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
దేశాన్ని అమ్ముకునే నేతలను దూరంగా ఉంచండి

ఓటు హక్కుపై సుదీర్ఘ ఉపన్యాసాలిచ్చే వ్యక్తులను అసలు నమ్మకూడదు. ముందు వాళ్లు ఓటు వేసి ఆదర్శంగా ఉంటూ తర్వాత ఇతరులకు సూక్తులు చెప్పేవారినే విశ్వసించాలి. ఓటు హక్కును వినియోగించుకోకపోవడం కూడా ఒక నేరమే అవుతుందని మరిచిపోకూడదు. ఓటు వేసే ముందు అన్ని రకాలుగా ఆలోచించండి.. డబ్బుకు అమ్ముడుపోయే నాయకుడెవరో అర్థం చేసుకోండి. గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించి.. తనకు ఓటు వేసిన ప్రజలను నట్టేట ముంచే వారిని దరి చేరనివ్వకండి. తన నియోజకవర్గం అభివృద్ధికి ఎక్కువ సమయాన్ని కేటాయించే అభ్యర్థినే ప్రోత్సహించండి… దేశాన్ని అమ్ముకునే నేతలను కాకుండా.. ఓటర్లను నమ్ముకుని.. వారి బాగోగుల కోసం పనిచేసే వారికే ఓటు వేయండి. మీ ఒక్క ఓటు తరతరాల తలరాతను మార్చుతుందని నిత్యం గుర్తుపెట్టుకోండి… నమస్తే…..