తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్రకు రావాల్సినంత పబ్లిసిటీ రావడం లేదు. రోడ్లు నిండిపోయేంత జనం ఉన్నా మీడియాలో పబ్లిసిటీ అంతంతమాత్రంగానే ఉంది. దీనికి ఏదైనా కారణం ఉందా… కాంగ్రెస్ ఆరోపించినట్లుగా కుట్ర జరుగుతోందా.. వాచ్ దిస్ స్టోరీ…
తెలంగాణలో కొనసాగుతున్న యాత్ర
మంగళవారానికి వారం పూర్తి
పరిగెత్తుతూ, జనాన్ని పరిగెత్తిస్తున్న రాహుల్
కాంగ్రెస్ నేతను చూసి జనం కేరింతలు
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారతో జోడో యాత్రను ప్రారంభించి 55 రోజులవుతోంది. తెలంగాణలోకి యాత్ర ఎంటరై వారం రోజులవుతోంది. కాంగ్రెస్ యువనేతను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఒక్కరిని కూడా వదలకుండా రాహుల్ దాదాపుగా అందరినీ పలుకరిస్తూ పోతున్నారు. వారి సమస్యను తెలుసుకుంటున్నారు.. కాంగ్రెస్ మళ్లీ అధికారానికి వస్తే ఏం చేస్తామో చెబబుతున్నారు. చిన్న పిల్లలు కూడా రాహుల్ ను కలుసుకుని కాసేపు ఆయనతో కలిసి నడుస్తున్నారు. ఆదివారం రోజు యాత్రలో రాహుల్ గాంధీ.. పిల్లలతో కలిసి పరుగుపందెం పెట్టుకున్నారు. దాదాపు వంద మీటర్లు రాహుల్ పరిగెట్టినప్పుడు పిల్లలు గానూ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు గానీ ఆయనతో పోటీ పడలేకపోయారు… .
ఎంత పరిగెత్తినా పట్టించుకోని మీడియా
కాసేపు లైవ్ ఇచ్చి సరిపెడుతున్న ఛానెల్స్
ఆశించిన పబ్లిసిటీ రావడం లేదంటున్న కాంగ్రెస్
ఆందోళనలో కాంగ్రెస్ నేతలు
రాహుల్ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. అందరినీ ఉత్సాహ పరుస్తున్నారు. కనిపించిన ప్రతీ ఒక్కరితో చేయి చేయి కలుపుతున్నారు. అయినా మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదనిపిస్తోంది. మొక్కుబడిగా కాసేపు లైవ్ వదిలేసి మమ అనిపిస్తున్నాయి. అంత పెద్ద ఈవెంట్ జరుగుతున్న అనుభూతిని తెలుగు మీడియా ఛానెల్స్ కలిగించలేకపోతున్నాయి. ఆశించినంత పబ్లిసిటీ రావడం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మునుగోడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాహుల్ యాత్ర పనికొస్తుందని భావించిన కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురైంది. దానితో వాళ్లు కొంతమేర ఆందోళనలో ఉన్న మాట వాస్తవం…
అటు రాహుల్ యాత్ర… ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
యాత్రను హైజాక్ చేసిన ఆడియో టేపుల చర్చ
తమపై కుట్ర జరిగిందంటున్న కాంగ్రెస్ నేతలు
బీజేపీ- టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపణలు
రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి ఎంటర్ కావడం, ఎమ్మెల్యేల కొనుగోలు కథ బయటపడటం ఒకే టైమ్ లో జరిగిపోయాయి. దానితో మీడియా అటెన్షన్ మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మధ్యవర్తుల వైపే తిరిగింది. రోజుల తరబడి…. పగలంటా మీడియా ప్రస్తారాలు ఆ అంశంపైనే జరిగాయి. ముగ్గురు నిందితుల రిమాండ్ కు కోర్టు నిరాకరించడంతో వేడి చల్లారిపోయి…. రాహుల్ యాత్రకు పబ్లిసిటీ వస్తుందనుకుంటే… కాంగ్రెస్ నెత్తిన మరో ఉపద్రవం వచ్చిపడింది. ఒకే రోజు రెండు ఆడియోలను టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలోకి విడుదల చేశారు. దానితో రెండు మూడు రోజులుగా అదే చర్చ జరుగుతోంది. పైగా ముగ్గురు నిందితులను రెండో సారి అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించిన వార్త కూడా హైలైట్ అయ్యింది. అందుకే కాంగ్రెస్ నేతలు మిగతా రెండు పార్టీలపై తీవ్ర ఆరోపణలు సంధిస్తున్నారు. సరిగ్గా రాహుల్ యాత్ర తెలంగాణలో మొదలైనప్పుడే బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు తోడుదొంగలంటూ విమర్శలు సంధిస్తున్నారు. రాహుల్ యాత్రను పక్కతోవ పట్టించేందుకు ఎమ్మెల్యేల కొనుగోలును బీజేపీ, టీఆర్ఎస్ తెరపైకి తెచ్చాయని, యాత్ర పూర్తయిన వెంటనే ఏమీ ఎరుగనట్లుగా సైలెంట్ అయిపోతారని ఆరోపిస్తున్నారు. ఏది నిజమో చూడాలి….