మెగాస్టార్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారా ? నాటి ప్రజారాజ్యం, నేటి జనసేన ఒకటవుతాయా ? నిద్రాణంగా పడున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ సాధ్యమా ?
జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించే వ్యూహం….
చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నం…
అన్నయ్య వస్తేనే తమ్ముడికి ప్రయోజనమని వాదనలు.
ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్న ప్రజారాజ్యం నేతలు…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు కొందరు నేతలు తమ వ్యూహాలను పదును పెడుతున్నారు. ఆ దిశగా మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ రాజకీయ రంగంలోకి లాగేందుకు ఆయన మాజీ అనుచరులు, అభిమానులు ప్రయత్నిస్తున్నారు. అన్నయ్య తిరిగొస్తేనే తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వాదిస్తున్నారు. అప్పటి ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి… కాంగ్రెస్ లో విలీనం తర్వాత మౌనంగా ఉండిపోయిన నేతలు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు… ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని.. చిరంజీవి వచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని పిలుపునిస్తున్నారు.
ప్రజారాజ్యం మాజీ నేతల ఆత్మీయ సమావేశం…
చిరంజీవిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయకూడదు..
ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం…
2008లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. 2009 ఎన్నికల్లో ఆయన పార్టీ 18 చోట్ల ఆ పార్టీ గెలిచింది. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక నియోజకవర్గంలో ఓడిపోయి… తిరుపతిలో గెలిచారు. తర్వాత ప్రజారాజ్యానికి దశ, దిశ లోపించింది. 2011లో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్య సభ సభ్యత్వాన్ని, కేంద్ర సహాయ మంత్రి పదవిని పొందారు. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయి చిరంజీవి సైడైపోయారు. దానితో మూడు సంవత్సరాల పాటు ప్రజారాజ్యంలో క్రియాశీలంగా పనిచేసిన నేతలు కొందరు .. కాంగ్రెస్ లో ఇమడలేక పక్కకు జరిగారు. వారంతా ఈ ఆదివారం తిరుపతిలో సమావేశమయ్యారు. . మొదట బలిజ సామాజిక వర్గం నేతలతో సమావేశం నిర్వహించాలని భావించారు. అయితే అందరివాడుగా మన్నలను అందుకున్న చిరంజీవిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం సరి కాదని పీఆర్పీలోని ఇతర కులాల నేతల్ని సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షణకు చిరంజీవి అభిమానులుగా పోరు సాగించాలని సమావేశం తీర్మానించింది. ఇలాంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుందని సమావేశం అభిప్రాయపడింది. చిరంజీవి అభిమానులను సంఘటిత పరిచేందుకు, ప్రజారాజ్యం మాజీ నేతలను తిరిగి రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఇదే తగిన తరుణమని వాదించారు….
చిరంజీవి, జనసేనలోకి రావాలని పిలుపు…
టీడీపీలో ఉన్న చిరంజీవి అభిమానులపై ఆశలు
వైసీపీ అసంతృప్తిపరులకూ గాలం…
జనసేన, టీడీపీ, బీజేపీ చేతులు కలపాలని డిమాండ్..
చిరంజీవి జనసేనలోకి వచ్చి గాడ్ ఫాదర్ పాత్ర పోషించాలని ప్రజారాజ్యం మాజీ నేతలు కోరుతున్నారు. వారికి ఇప్పుడున్న జనసేన నేతలు మద్దతు పలికారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి తమకు దిశానిర్దేశం చేయాలని వారు కోరుతున్నారు. పూర్వ ప్రజారాజ్యం మిత్రుల ఆత్మీయ కలయిక ద్వారా… చిరంజీవికి నేరుగా విజ్ఞప్తులు చేశారు. ప్రజారాజ్యాన్ని క్లోజ్ చేసిన తర్వాత కాంగ్రెస్ లో ఇమడలేని చాలా మంది నేతలు టీడీపీలో చేరిపోయారు. ఇష్టమైతే వాళ్లంతా జనసేనలో చేరొచ్చని .. లేనిపక్షంలో టీడీపీలోనే ఉంటూ చిరంజీవికి మద్దతు పలకాలని ఆత్మీయ సమ్మేళనం ద్వారా కోరుతున్నారు. వైసీపీలోని అసంతృప్తిపరులు కూడా రావచ్చంటూ గాలం వేస్తున్నారు. అధికారపార్టీలోని కాపు సామాజికవర్గం నేతలు కొంత ఉక్కపోతకు గురవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నాటికి వారిని బయటకు లాగే ప్రయత్నం జరుగుతోంది. ఏదేమైనా ప్రజారాజ్యం మాజీ నేతలు ఒక విషయంలో మాత్రం క్లారిటీతో ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఏకతాటిపైకి వస్తేనే జగన్ రెడ్డిని ఓడించే వీలుంటుందని వాళ్లు బాహాటంగా అంగీకరిస్తున్నారు…