మస్క్‌ రాగానే ఊస్టింగ్‌.. పరిహారమెంతో తెలుసా!

By KTV Telugu On 31 October, 2022
image

విజయ అవమానకర నిష్క్రమణ..పరిహారం రూ.120 కోట్లు..
మస్క్‌కు విజయగద్దె మీద అంత కోపమెందుకంటే..

అనుకున్నదే. కాకపోతే క్షణం ఆలస్యం కాలేదు. ట్విట్టర్‌ చేతిలోకి రావడమే ఆలస్యం ఎలాన్‌మస్క్‌ టాప్‌ పొజిషన్‌లో ఉన్నవారిమీద వేటేశాడు. ఎప్పట్నించో తాను ఉక్రోషంతో ఉన్నవారిని అవమానకరంగా సాగనంపాడు. ఎలాన్‌మస్క్‌ వేటేసిన వారిలో కీలకమైన వ్యక్తి విజయ గద్దె. ట్విటర్‌లో మొన్నటిదాకా కీలకమైన పొజిషన్‌లో ఉన్న విజయ గద్దె హైదరాబాద్‌లో పుట్టిన భారతీయమహిళ. ఇన్నాళ్లుగా ఆమె ట్విట్టర్ పాలసీ, లీగల్, ట్రస్ట్ హెడ్‌గా కొనసాగారు.

విజయ గద్దె మూడేళ్ల వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. అక్కడే ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. ట్విట్టర్‌లో చేరకముందు విజయ గద్దె లాయర్‌గా చేశారు. తర్వాత వేర్వేరు శాఖల్లో పనిచేసి 2011లో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో అడుగుపెట్టారు. ఒక్కో మెట్టు అధిరోహిస్తూ ట్విట్టర్ లీగల్, పాలసీ, ట్రస్ట్ హెడ్‌ విభాగాధిపతి స్థాయికి ఎదిగారు. లీగల్ హెడ్‌గా ట్విటర్‌ సీఈవో కంటే కీలకంగా వ్యవహరించారు. ద్వేషపూరిత ప్రకటనలు, ట్వీట్లు, వేధింపులు, తప్పుడు సమాచారాన్ని ట్విటర్‌లో నియంత్రించడంలో విజయగద్దె చొరవచూపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ని నిషేధించాలని నిర్ణయించిన ట్విట్టర్ కమిటీలో విజయ గద్దెనే కీలకం.

ఎలాన్‌మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకించిన ముఖ్యుల్లో విజయగద్దె కూడా ఉన్నారు. ట్రంప్‌ ఎకౌంట్‌ని నిషేధించటంపై అప్పట్లోనే విజయని ఎలాన్‌ మస్క్‌ టార్గెట్‌ చేసుకున్నారు. ఆయనే ఇప్పుడు ట్విటర్‌ని టేకోవర్‌ చేయటంతో వచ్చీరాగానే మిగిలినవారితో పాటు విజయ గద్దెని తప్పించారు. ట్విట్టర్ డీల్‌ని పూర్తి చేసి ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ని తప్పించిన ఎలాన్ మస్క్ వీరికి దాదాపు రూ.725 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఎందుకంటే ముగ్గురికీ ట్విట్టర్‌లో షేర్లున్నాయి. అదేకాకుండా నిర్బంధంగా పదవీ గడువుకు ముందే తప్పించినందుకు మస్క్‌ అంత మొత్తం ఇవ్వాల్సిందే.

ట్విట్టర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ 38.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.320 కోట్లు) దక్కుతాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ నెడ్ సెగల్‌కు 25.4 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.200 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇక లీగల్ హెడ్‌ అయిన విజయా గద్దె రూ.120 కోట్లకుపైగా దక్కే అవకాశం ఉంది. తానురాగానే ఉద్వాసన తప్పదని హెచ్చరికలు చేస్తూ వచ్చిన మస్క్‌ అన్నంత పనీ చేశాడు. తన ఎకౌంట్‌ని బ్యాన్‌ చేసిన ట్విటర్‌ పాత టీంమీద ట్రంప్‌కూడా పీకల్లోతు కోపంగా ఉన్నారు. అందుకే వాళ్లని మస్క్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. అతన్ని తెగ పొగిడేశారు. ట్విటర్‌ పిట్ట ఎలా కూయబోతోందన్న సంగతి పక్కనపెడితే ట్రంప్‌ ఖాతాను మళ్లీ పునరుద్దరించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.