మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం తుది ఘట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సంబంధించిన సుశీ ఇన్ఫ్రా సంస్థ నుంచి సుమారు రూ.5.24 కోట్లను.. చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని.. ఆ నగదు అంతా ఓటర్లకు పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నిక సమయంలో భారీగా నగదు బదిలీ చేయడం నియమావళిని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో టీఆర్ఎస్ స్పష్టం చేసింది. టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. నగదు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారని టీఆర్ఎస్ ఆరోపించి.. ఈసీకి కంప్లైంట్ చేసింది. దీనిపై సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా.. వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడంతో మునుగోడు రాజకీయం కీలక మలుపు తిరిగింది.
టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఇవ్వకుంటే.. చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. అయితే సుశీ ఇన్ ఫ్రా కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థ ఎవరికి డబ్బులు పంపిందో తనకు తెలియదని రాజగోపాల్ రెడ్డి ఈసీకి వివరణ ఇచ్చారు. అంతకు ముందు ఈసీ మంత్రి జగదీశ్‌రెడ్డికి కూడా నోటీసు జారీ చేసింది. ఈ నెల 25న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం.. జగదీశ్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి వివరణ ఇవ్వకపోవటంతో.. 48 గంటల పాటు మంత్రిపై నిషేధం విధించింది. మునుగోడులో ప్రచారానికి సబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది.