పవన్ కోసం “కాపు” కాస్తున్నారా?

By KTV Telugu On 31 October, 2022
image

పవన్ దూకుడుతో వైసీపీ అప్రమత్తం

వ్యూహాలు మార్చుకుంటోన్న జగన్
రాజమండ్రిలో వైసీపీ “కాపు” నేతల భేటీ
బాబు, పవన్ లు టార్గెట్ గా వ్యూహరచన

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రాష్ట్రంలో దూకుడు పెంచిన జనసేనాని, టీడీపీతో పొత్తుకు సై అంటూ సిగ్నల్ ఇవ్వడంతో…. వైసీపీ అప్రమత్తమైంది. తన వ్యూహాలు మార్చుకుంటోంది. ఇప్పటికే బీసీ ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్న అధికార పార్టీ, ఇప్పుడు కాపులపై ఫోకస్ పెట్టింది. పవన్ కల్యాణ్ పై జగన్ కాపు తూటా ఎక్కుపెట్టారు. కొద్ది రోజుల క్రితం బీసీ వర్గానికి చెందిన వైసీపీ నేతల సమావేశం జరిగింది. తాజాగా, రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ప్రజాప్రతినిథుల భేటీలో బాబు, పవన్ లను ఇరుకునపెట్టేలా పలు కీలక విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు అమలుతో పాటు…మంత్రివర్గం నుంచి క్షేత్రస్థాయి పదవుల వరకు జగన్ కాపులకు చేసిన మేలు గురించి వివరించాలని ఆ వర్గం వైసీపీ నేతలు నిర్ణయించారు.

మరోవైపు, ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనే వ్యూహంతో వైసీపీ బాణం ఎక్కుపెడుతోంది. పవన్ కళ్యాణ్ మరో నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్దమవుతున్నారంటూ జనసేనానిని ఆత్మరక్షణలో పడేసే వ్యూహం తెర మీదకు తీసుకొస్తున్నారు వైసీపీ కాపు నేతలు. కాపుల ఓట్లును హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేసేందుకు పవన్ సిద్దమయ్యారంటూ ఇటీవల కాకినాడ సభలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే నినాదం బలంగా కాపు వర్గంలోకి తీసుకెళ్లాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. జనసేనకు బలం కాపు ఓట్లే. తనకు ఏ కులం లేదని పవన్ చెబుతున్నా…ఆ సామాజికవర్గం తమకు అండగా ఉంటుందని జనసైనికులు భావిస్తారు. కానీ, 2019 ఎన్నికల్లో కాపుల ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయి. మరోసారి ఆ సామాజిక వర్గం ఓట్లను పవన్ కు దూరం చేసేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. తద్వారా బాబును రాజకీయంగా, సామాజికంగా మరోసారి దెబ్బకొట్టచ్చనే ఎత్తుగడలు వేస్తోంది.

రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమావేశం అలా ఉంటే…నిన్న తిరుపతి వేదికగా జనసేనకు మద్దతుగా పూర్వ ప్రజారాజ్యం నేతలంతా సమావేశం పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల్లోని మాజీ ప్రజారాజ్యం నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. చిరంజీవి ఫొటోతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజిక వర్గం నేతలు పాల్గొనడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-జనసేన పొత్తు వార్తలతో రెండు పార్టీల్లోని బలిజ సామాజికవర్గం నేతలు ఏకమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పవన్ రాజకీయం మొదలుపెట్టారు. పిట్టగూటిలో ప్రభుత్వంపై విమర్శల పర్వం కొనసాగిస్తూనే…నేరుగా రంగంలోకి దిగి తేల్చుకుందాం రమ్మంటూ వైసీపీకి సవాళ్లు విసురుతున్నారు. అటు టీడీపీ జత కలుస్తుండడం, సీమలో మాజీ పీఆర్పీలంతా మళ్లీ ఒక్కటవ్వడంతో…వైసీపీ కాపు ఈక్వేషన్స్ ఏమేరకు వర్కవుట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.