సుప్రీంకోర్టు తలుపు తట్టిన ఫామ్‌హౌస్‌ నిందితులు

By KTV Telugu On 1 November, 2022
image

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మంగళవారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తమను అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొంటూ… తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని తమ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరారు. ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతం మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ వేదికగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారనే ఆరోపణలపై ఈ ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరి రిమాండ్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దాంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం జైలులో వున్న నిందితులు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. మరోవైపు
నిందితులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… ఈ నెల 4న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందుకు రాగా… దాన్ని శుక్రవారం నాటి కేసుల జాబితాలో చేర్చాలని ఆదేశాలు ఆయన జారీ చేశారు.