దాదాపు నెల రోజుల నుంచి మునుగోడును హోరెత్తించిన మైకులు మూగబోయాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వం ముగిసింది. నియోజకవర్గంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ప్రచారం ముగియడంతో నియోజకవర్గంలో బయటి వ్యక్తులు ఎవరూ ఉండొద్దని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా లోనూ ఎలాంటి ప్రచారం చేయవద్దని సూచించారు. ఈ రెండు రోజులు మునుగోడులో విస్తృత తనిఖీలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంది.
నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, 6వ తేదీన కౌంటింగ్ చేసి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1192 మంది సిబ్బంది అవసరం ఉండగా అదనంగా 300 మందిని నియమించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు కల్పించనున్నారు. అయితే ప్రచార పర్వం ముగియడంతో ఇక చాటుమాటు ప్రలోభాలకు తెర లేపే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటుకు ఇంత అని లెక్క కట్టి ముట్టజెప్పిన నేతలు మందు, విందులతో ఓటర్లను ఆకట్టుకునే
ప్రయత్నాలు ఊపందుకుంటాయి.