సుప్రీంకోర్టులో అమరావతి విచారణ జాప్యం
పాదయాత్రకు సన్నద్ధమవుతున్న రైతులు
మళ్లీ రాజధాని రాజకీయం షురూ..
ఏపీలో రాజధానిపై మళ్లీ రాజకీయ పోరు మొదలైనట్లే కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో అమరావతి విచారణ జాప్యం, రైతుల పాదయాత్ర రద్దుకు హైకోర్టు ఆసక్తిచూపకపోవడం వంటి కీలక పరిణామాలతో…. అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న పోరాటం మళ్లీ ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. జగన్ సర్కార్ మళ్లీ తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరగా విచారణ జరపాలంటూ సీజేఐను అభ్యర్థించింది. అయితే, ఈ కేసు నిన్న బెంచ్ మీదకు వచ్చిన సమయంలో, అనూహ్యంగా సీజేఐ లలిత్ విచారణ నుంచి తప్పుకున్నారు. దాంతో, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లతో పాటు…రైతులు, ఇతర వర్గాలు దాఖలు చేసిన 9 కేవియట్ పిటిషన్లపైనా విచారణ ప్రారంభమైనట్లే ప్రారంభమై ఆగిపోయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యూయూ లలిత్ గతంలో 2014లో విభజన చట్టంపై తన అభిప్రాయం చెప్పారు. ఈ కారణంగానే ఈ విచారణ నుంచి తప్పుకుని మరో బెంచ్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు.
అదే సమయంలో రైతులు సాగిస్తున్న పాదయాత్రకు గతంలో ఇచ్చిన అనుమతుల్ని కొనసాగిస్తున్నట్లు…. ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. ఈ పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలని డీజీపీ కోరినా హైకోర్టు అంగీకరించలేదు. దీంతో, రైతులు తిరిగి పాదయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే ఆగిపోయిన చోట నుంచే పాదయాత్ర ప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే, మరోసారి రైతుల పాదయాత్రను వైసీపీ అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఉద్యమం మొదలైంది. రైతుల పాదయాత్రకు అక్కడక్కడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మహాపాదయాత్రను అడ్డుకొని తీరుతామంటూ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిథులు హెచ్చరిస్తున్నారు. దీంతో, మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకునే ఛాన్స్ ఉంది.
మూడు రాజధానులకు మొగ్గుచూపిన జగన్ సర్కార్…దాన్ని అమల్లోకి తీసుకురావడంలో విఫలం అవుతోంది. అమరావతిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నప్పటికీ… ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదు. మూడు రాజధానులతోనే ముందుకు వెళ్తామంటోంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని టైట్ చేసే ప్రణాళికలో భాగంగా…ఉత్తరాంధ్ర, రాయలసీమలో సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే విశాఖ గర్జన పేరుతో వేడి రగిల్చిన వైసీపీ…ఉత్తరాంధ్రలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. టీడీపీ, జనసేనలను ఇరుకునపెట్టే వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. అటు రాయలసీమలోనూ రాజధాని పోరాటాన్ని మొదలుపెట్టారు. మరోవైపు, సుప్రీంకోర్టులో కొత్త బెంచ్ ఏర్పాటు చేసి సత్వర విచారణ జరపాలని ప్రభుత్వం కోరే అవకాశాలున్నాయి.