ప్రధానితో చెట్టపట్టాల్‌.. గెహ్లాట్‌ రెడీ టూ జంప్‌!

By KTV Telugu On 2 November, 2022
image

గెహ్లాట్‌ గెంతుతాడా? సచిన్‌ ఆరోపణలు నిజమేనా?

విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ పేరెత్తితేనే మండిపడతారు. ఆయనపై విమర్శలు గుప్పిస్తారు. మోడీ రాష్ట్రాలకొచ్చినా కొందరు సీఎంలు ఎడమొహం పెడమొహంలాగే ఉంటున్నారు. ఇలాంటి టైంలో ఆ స్టేజీమీద దృశ్యాన్ని చూసి అంతా వాహ్‌ క్యా సీన్‌ హై అన్నారు. ఎందుకంటే మధ్యలో మోడీ. ఒకవైపు మధ్యప్రదేశ్‌ బీజేపీ ముఖ్యమంత్రి, మరో పక్క కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌ ముఖ్యమంత్రి. రాజస్థాన్‌లో నిర్వహించిన ‘మంగఢ్‌ ధామ్‌కి గౌరవ్‌ గాథా’ కార్యక్రమ వేదికపై కనిపించిందీ సీన్‌.

ప్రధానమంత్రి రాష్ట్రానికొచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఆయనతో వేదికను పంచుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ ఈమధ్య రాజస్థాన్‌ ముఖ్యమంత్రికి ప్రధానిపై ప్రేమ పెరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వంతో దూరం పెరుగుతోంది. అందుకే కాంగ్రెస్‌వాళ్లు దాల్‌మే కుఛ్‌ కాలా హై అంటున్నారు. ఇక పెద్దాయన దిగిపోతే సీఎం సీట్లో కూర్చోవాలని ఉబలాటపడుతున్న సచిన్‌ పైలెట్‌ లాంటి యువనాయకుడైతే చూశారా చూశారా నేను చెప్పినట్లే జరుగుతోందంటున్నాడు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోడీని అశోక్‌గెహ్లాట్‌ ప్రశంసించడాన్ని సచిన్‌ పైలెట్‌ తప్పుపడుతున్నాడు. గెహ్లాట్‌ గోడెక్కేస్తున్నాడని ఏ క్షణమైనా దూకేస్తాడని పార్టీ హైకమాండ్‌ని అలర్ట్‌ చేస్తున్నాడు.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఒకే ఒరలో రెండు కత్తులు. ఆమధ్య అశోక్‌గెహ్లాట్‌ని మారుస్తారనే ప్రచారంతో ఆయన వర్గం తిరుగుబాటుకు దిగింది. ఓ దశలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతుందనిపించింది. ఏఐసీసీ అధ్యక్షపదవికంటే రాజస్థాన్‌ సీఎం సీటే తనకు ముఖ్యమనుకున్నారు అశోక్‌ గెహ్లాట్‌. ఇప్పుడు మోడీతో వేదికను పంచుకోవడమే కాకుండా పొగిడేయటంతో ఆయన కూడా గులాంనబీఆజాద్‌ బాటలోనే ఉన్నారని సచిన్‌ వర్గం వార్నింగ్‌బెల్‌ మోగిస్తోంది. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ పార్టీ అధినాయకత్వానికి సచిన్‌ పైలెట్‌ సూచించారు. దీంతో కాంగ్రెస్‌ పెద్దలు కూడా పెద్దాయన్ని అనుమానంగా చూస్తున్నారు.

రాజస్థాన్‌లో గెహ్లాట్‌కి సచిన్‌ కంట్లో నలుసులా మారిపోయాడు. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా యువనాయకత్వానికి అధికారం అప్పగించాలనుకుంటోంది కాంగ్రెస్‌ కూడా. కానీ గెహ్లాట్‌ని తప్పిస్తే తిరుగుబాటు తప్పదని తెలుసు. అందుకే టైంకోసం చూస్తోంది. కీడెంచి మేలెంచాలన్నట్లు అశోక్‌గెహ్లాట్‌ కూడా గోడెక్కి రెడీగా ఉన్నారు. తేడావస్తే కండువా మార్చేయడం ఖాయం. అందుకే మోడీకి గెహ్లాట్‌ చిడతలు వాయిస్తే…ప్రధాని కూడా అశోక్‌జీని ఆప్యాయంగా పలుకరించారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గులాంనబీని పొగుడుతూ మోడీ భావోద్వేగానికి గురైనప్పుడే కాంగ్రెస్‌ ఆయనపై ఆశలొదిలేసుకుంది. చివరికి ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. ఇప్పుడు మరో తలపండిన నేత కూడా అలాంటి సంకేతాలే ఇస్తున్నారు.