పవన్ కదలికలపై నిఘా పెట్టిందెవరు?
జనసేనానిని ఎందుకు వెంబడిస్తున్నారు?
విశాఖ ఘటన తర్వాత మారిన రాజకీయం
పవన్ కు జడ్ ప్లస్ భద్రత కోరుతున్న జనసేన
విశాఖ ఘటన తర్వాత ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారన్న వార్త రాజకీయంగా కలకలం రేపుతోంది. పవన్ కల్యాణ్ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పవన్ కల్యాణ్ ఆఫీస్, ఇంటివద్ద కొందరు ఆగంతకులు తచ్చాడుతున్నారంటూ…జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లినా కారు, బైకులతో వెంటబడుతున్నారని …భద్రతా సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని నాదెండ్ల తెలిపారు. ఇదే సమయంలో పవన్ ఇంటిముందు గొడవకు దిగిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ ను తిడుతూ సిబ్బందిని రెచ్చగొట్టే విధంగా ఆ యువకులు ప్రయత్నించారని నాదెండ్ల ఓ ప్రకటనలో తెలిపారు. గతంలోనే నిఘా అధికారులు హెచ్చరించారని జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు.
ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలతో …వైసీపీ, జనసేనల మధ్య భీకర రాజకీయ యుద్ధం నడుస్తోంది. వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న జనసేనాని, దూకుడుగా వెళ్తున్నారు. వైసీపీ ఒకటంటే, తాము రెండు అంటామన్న రీతిలో రాజకీయం నడుస్తోంది. గత నెల 15న విశాఖ కేంద్రంగా వికేంద్రీకరణకు మద్దతుగా గర్జన జరిగింది. అదేరోజు పవన్ నగరంలో అడుగుపెట్టడంతో కాక పెంచింది. ఈ సందర్భంగా మంత్రుల కాన్వాయ్ పై దాడి ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. ఆ సందర్భంగా పోలీసులు పలువురు జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. అదే సమయంలో నగరాన్ని విడిచి వెళ్లాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం…తమ నేతలను విడిచిపెట్టేవరకు వెళ్లేది లేదని పవన్ భీష్మించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎట్టకేలకు, జిల్లా కోర్టు ఆదేశాలతో జనసేన నాయకులు రిలీజ్ అయ్యారు. అయితే, రిమాండ్ లో ఉన్న 9మంది ఇటీవల విడుదలయ్యారు. ఆ ఘటన జరిగినప్పట్నుంచి తమ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్, వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దగ్గరవడంతో రాజకీయంగా పొలిటికల్ హీట్ పెంచేసింది.
ఇటీవల టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై ప్రతీకారచర్యగా… ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ నిఘాహెచ్చరించింది. అయితే, అదంతా వైసీపీ డ్రామాగా అభివర్ణించిన ఆ పార్టీ నేత నాగబాబు… ఏదో కుట్ర జరుగుతోంది, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే, తాజాగా పవన్ ను వెంటాడుతున్నారంటూ ఆ పార్టీ చేసిన ప్రకటన అలజడి రేపుతోంది. ఇంతకీ పవన్ కదలికలపై నిఘా పెట్టిందెవరు? హైదరాబాద్ లో జనసేనానిని ఎందుకు వెంబడిస్తున్నారు? పవన్ కల్యాణ్ ను అనుసరిస్తున్నవారు అభిమానులు కాదని, వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయనపై వైసీపీ కుట్రలు చేస్తోందని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ట్విటర్లో #APNeedsPawanKalyan #ZplusSecurityForPawanKalyanని ట్రెండ్ చేస్తున్నారు. జనసేన ఆరోపణలపై వైసీపీ నేతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.