మునుగోడు ఉప ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి ఓటర్లు పెద్ద సంఖ్యలు వచ్చారు. ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో మాత్రం ఓటు వేయడానికి వెళ్లలేదు. కారణం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం చెప్పారు. ఓటుకు తులం బంగారం ఇస్తామన్నారు…ముప్పయి వేలు పంచుతామన్నారు…అదీ లేదు ఇదీ లేదు అని మండిపడ్డారు గ్రామస్తులు. ఏ పార్టీవాళ్లు కూడా తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వారు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఓటు వేయడానికి రావాలంటూ ఓటర్లకు నచ్చచెప్పారు. అయితే తమకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని తేల్చి చెప్పారు వాళ్లు. చోటామోటా నాయకులు లక్షలు లక్షలు తీసుకుని తమకు పంచకుండా ఇంట్లో దాచుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకులు కొంతమందికి ఓటుకు మూడు వేలు చొప్పున పంచారని, అది కూడా అందరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ వాళ్లు డబ్బులు పంచలేదు…బీజేపీ వాళ్లు డబ్బులు పంచకుండా పోలీసులు పట్టుకుపోయారు…ఇలా అయితే ఎలా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. తమకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని స్పష్టం చేశారు.