ప్రధాని మోదీని పవన్ కలుస్తారా…లేదా ?
మోదీ పిలిస్తే వెళ్లాలని ఆరాటపడుతున్న పవన్
మూడేళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో సహవాసం చేస్తున్నారు. ఈ మూడేళ్లలో ఆయన ప్రధానమంత్రి మోదీపైన కానీ కేంద్ర ప్రభుత్వంపైన కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. చివరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు పరం చేస్తున్నా కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. దానికి కూడా వేసీసీ ప్రభుత్వాన్నే తప్పు పట్టారాయన. ఆ మధ్య రోడ్డు మ్యాప్ ఇవ్వాలని బీజేపీ పెద్దలను అడిగారు. కానీ వారు పట్టించుకోలేదు. దాంతో ఉన్నట్లుండి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇక బీజేపీతో జనసేన బంధం తెగిపోయినట్లే అని టీడీపీ నేతలు ప్రకటించారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం జనసేనతో కలిసి ముందుకెళ్తాం అని నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో
ప్రధాని నరేంద్రమోడీ సభ విశాఖ పర్యటనకు వస్తున్నారు. అక్కడే రెండు రోజుల పాటు ఉంటారు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక బహిరంగ సభలో కూడా పాల్గొంటారు మోది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీని కలుసుకుంటారా లేదా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమ మిత్రపక్షమైన జనసేనకు అసలు ఆహ్వానం వెళ్లిందా అనేది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
అయితే ప్రధాని మోడీ కార్యక్రమానికి తాను కూడా హాజరు కావాలని జనసేనాని పవన్ కల్యాణ్ ముచ్చటపడుతున్నారట. అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి వేదిక పంచుకోవాలని ఆయన తెగ ఉత్సాహపడుతున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకునే లెవల్లో ఆల్రెడీ సంకేతాలు ఇచ్చిన పవన్ కల్యాణ్.. మరోవైపు మోడీ సభలో పాల్గొని తాను చాలా కీలకమైన నాయకుడిని అని చెప్పుకోవాలని తహతహలాడుతున్నారని సమాచారం. తనను ఎలాగైనా ఆ కార్యక్రమానికి పిలవాలని బిజెపిలో తనకు తెలిసిన నాయకుల ద్వారా పైరవీలు చేయించారట. వాళ్లేమన్నారో తెలియదు. గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా.. టెక్నికల్‌గా కాంగ్రెసు పార్టీ నాయకుడు అయిన, కేంద్ర మాజీమంత్రి చిరంజీవిని ఆహ్వానించారు గానీ.. తమ భాగస్వామ్య పార్టీనేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదు. పవన్ కల్యాణ్ ను బిజెపి పక్కన పెట్టేసినట్టే అని అప్పుడు ప్రచారం జరిగింది. పవన్ తమతోనే ఉన్నాడని చెప్పుకుంటున్న బీజేపీ ఏం చేస్తుందో చూడాలి మరి.