బీజేపీకి త్వరలో పాన్‌ ఇండియా సినిమా చూపిస్తాం – కేటీఆర్‌

By KTV Telugu On 3 November, 2022
image

ఇప్పుడే ఏమైంది…బీజేపీకి ముందుంది ముసళ్ల పండగ అంటున్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు చూసింది ట్రయిలర్‌ మాత్రమే…ముందు ముందు పాన్ ఇండియా లెవెల్లో సినిమా చూపిస్తాం. అందులో దృశ్యాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని తమను నైతికంగా దెబ్బకొట్టాలని బీజేపీ వేసిన ప్లాన్‌ను తాము తిప్పికొట్టామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మునుగోడులో సభ నిర్వహించి ఆ నలుగురినీ పార్టీలో చేర్చుకోవాలనుకున్నారని, కానీ బెడిసికొట్టడంతో సభను రద్దు చేసుకున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్‌కు పునాది అవుతుందని కేటీఆర్ అన్నారు. సరైన నాయకత్వం, పోరాట పటిమ లేని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం బీజేపీ అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రలోభ పెట్టింది త్వరలోనే మొత్తం సినిమా బయటకు వస్తుందని అన్నారు. మునుగోడులో ఓటమి ఖాయమనే నడ్డా, అమిత్ షా ప్రచారానికి రాలేదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు మఠాధిపతులను వినియోగించుకోవడం ద్వారా హిందూ మతానికి బీజేపీ చెడ్డపేరు తెస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. రాహుల్‌ పాదయాత్ర మీద కూడా కేటీఆర్‌ వ్యంగాస్త్రాలు సంధించారు. దేహదారుఢ్యం కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ బిజీగా ఉంటే రాహుల్ మాత్రం ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారని అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. మొదట ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనే పోటీ చేస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై పైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌వి నామమాత్రపు అధికారాలు మాత్రమేనని అన్నారు. ఆమె తన స్థాయిని పరిధికి మించి ఊహించుకుంటూ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ఆమోదించకున్నా బిల్లులు అమలవుతాయని కేటీఆర్ తేల్చిచెప్పారు.