అడ్డగోలుగా యుద్ధం..పైగా రోజుకో అబద్ధం!
దొంగే దొంగా దొంగా అని అరిస్తే ఎలా ఉంటుంది. రష్యా ఆడుతున్న తొండాట అలాగే ఉంది. ఓ పక్క జనవాసాలు, రద్దీప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఎడాపెడా దాడులుచేస్తోంది రష్యా. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగిస్తానంటోంది. ఉక్రెయిన్‌పై ఏ క్షణమైనా డర్టీబాంబ్ వేయడానికి రెడీగా ఉంది. అయినా గురివిందగింజలా ఉక్రెయిన్నుంచి ముప్పుందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ జీవాయుధాలు తయారుచేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. దీనిపై దర్యాప్తు చేయాలంటూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే రష్యాకి జిత్తులమారి చైనా ఒక్కటే అనుకూలంగా ఓటేసింది.
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మన దేశం ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఉక్రెయిన్ జీవాయుధాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని రష్యా చెబుతోంది. అమెరికాతో కలిసి ఉక్రెయిన్ మిలిటరీ బయోలాజికల్ కార్యకలాపాలు సాగిస్తోందని రష్యా కొన్నాళ్లుగా అరచి గోలచేస్తోంది. దీనిపై కమిషన్ ఏర్పాటు చేసి వెంటనే ఎంక్వయిరీ చేయాలని యూఎన్వో భద్రతామండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. రష్యావాదనకు చైనా ఒక్కటే వంతపాడింది.
రష్యా తీర్మానాన్ని అమెరికా, యూకే, ఫ్రాన్స్ వ్యతిరేకించాయి. భారత్‌తో పాటు భద్రతా మండలిలోని మిగిలిన సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. అయితే రష్యా తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొనకపోవడం మాత్రం ఇదే మొదటిసారి. రష్యా వాదనలను మొదటినుంచీ ఖండిస్తూ వచ్చిన అమెరికా తాజాగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉత్తర కొరియా భారీగా రష్యాకు ఆర్టిలరీ షెల్స్ చేరవేస్తోందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ఐరాసలో దీనిపై చర్చించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నార్త్‌కొరియా కూడా తలదూర్చినట్లయింది.