గాలి పీల్చలేం..ముక్కు మూసుకోలేం!
స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతోంది. దేశ రాజధానిలో ముక్కు మూసుకుని బతకాల్సి వస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. టపాసులు నిషేధించినా ఢిల్లీవాసులు మోతమోగించారు. ఇప్పుడు పొరుగురాష్ట్రాల పంటపొలాల్లో నిప్పుపెడితే ఢిల్లీని పొగ కమ్ముకుంటోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తున్నారు. దీంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 354గా నమోదైంది. ఈ కొలమానం వెరీ పూర్.
పంజాబ్లో పంట వ్యర్థాల కాల్చివేతను నిరోధించాలని ఢిల్లీ ప్రభుత్వం నెత్తీనోరు బాదుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ఇప్పుడు పంజాబ్లో కూడా ఆమ్ఆద్మీ ప్రభుత్వమే ఉండటంతో వాయుకాలుష్యంపైనా రాజకీయ విమర్శలు గుప్పుమంటున్నాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని యూపీ, హర్యానా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి అభ్యర్థించారు. కాలుష్య సమస్య రాష్ట్ర సమస్య కాదు. కానీ ప్రజారోగ్యం విషయంలోనూ రాజకీయమే నడుస్తోంది.
వాయుకాలుష్యం చేయి దాటిపోవటంతో ఢిల్లీలో అన్ని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. నిషేధ సమయంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5 వేలు అందించాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఉద్యోగులను వీలునుబట్టి వర్క్ ఫ్రం హోమ్ పనిచే యాలని సూచించారు. ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని అభ్యర్థిస్తున్నారు. మరో వైపు గాలి నాణ్యత మెరుగుపడేదాకా స్కూళ్లను మూసేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నాగరికులం అని విర్రవీగుతూ ప్రకృతికి సవాలు విసిరితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఢిల్లీ పరిస్థితి కళ్లకు కడుతోంది