లేదు లేదంటూనే ఉద్యోగులకు మస్క్ ఎసరు!
అసలే కోతి. ఆపై కల్లుతాగితే ఎలా ఉంటుందో చెప్పాలా…ట్విటర్‌లాంటి దిగ్గజ ప్లాట్‌ఫాంని టేకోవర్ చేసిన శ్రీమంతుడిని కోతి అనలేంగానీ ఆయనగారి చేష్టలు మాత్రం అలాగే ఉన్నాయ్. ట్విటర్ చేతుల్లోకి రాకముందే సీన్లోకొచ్చాక ఏం చేయాలో ఎలాన్‌మస్క్‌కి ఫుల్ క్లారిటీ ఉంది. డోంట్‌కేర్ అంటూ తాను అనుకుంది చేసుకుపోతున్నాడు. భారీగా పరిహారం ఇచ్చేందుకు సిద్ధపడి ట్విటర్ హెడ్స్‌ని తప్పించిన ఎలాన్‌మస్క్ లేదు లేదంటూనే ఉద్యోగుల ఊస్టింగ్‌కి రెడీ అవుతున్నాడు.
ట్విటర్‌లో దాదాపు సగం మందిని ఎలాన్ మస్క్ ఇంటికి పంపే ఆలోచనలో ఉన్నాడు. పొమ్మనకుండా పొగబెడుతున్నాడు. ఉద్యోగుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాడు. రోజుకు 12 గంటలు పనిచేయాలని కొంతమంది ఉద్యోగులను ఎలాన్‌మస్క్ ఆదేశించినట్లు వార్తలొస్తను్నాయి. సిబ్బందికి స్పెషల్ టాస్క్‌లు, డెడ్‌లైన్లు తలమీద పడుతున్నాయి. ఇక మేనేజర్ స్థాయి ఉద్యోగులు వారాంతరంలో రాత్రి ఆఫీసుల్లోనే పడుకున్నారని న్యూయార్క్ టైమ్స్ కథనం ఇచ్చింది. ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ చేసినప్పటినుంచీ ఉద్యోగులకు కంటిమీద కునుకు కరువైంది.
ఎలాన్‌మస్క్ ట్విటర్ అధిపతికాగానే ఉద్యోగులు తమ సీట్ల మీద ఆశలు వదిలేసుకున్నారు.
భారీ తొలగింపులేమీ ఉండవని చెప్పిన మస్క్ ఇప్పుడు తూచ్ అంటున్నాడు. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దాదాపు 3,700 మంది సిబ్బందిని సాగనంపే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ప్రస్తుతం ట్విటర్ అమలు చేస్తున్న ఎక్కడి నుంచైనా పనిచేసుకునే విధానాన్ని కూడా మస్క్ వెనక్కి తీసుకుంటున్నాడు. మరోవైపు బ్లూ టిక్‌తో పాటు ఇతర సదుపాయాలకు నెలనెలా 8 డాలర్లు చెల్లించాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కానీ నే పట్టిన కుందేలుకి మూడే కాళ్లనే మస్క్ తగ్గేదేలే టున్నాడు.