టీమిండియా.. బలుపు కాదు వాపే!

By KTV Telugu On 3 November, 2022
image

పొరపాటు..తడబ్యాటు..ఏమైంది మనోళ్లకి!
పసికూన మీద కూడా చివరిబాల్‌ దాకా ఫైట్‌!

బంగ్లాదేశ్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకప్పుడు పసికూన. బంగ్లాదేష్ తో మ్యాచ్‌ అంటే వార్‌ వన్‌సైడే. కానీ టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో చివరిబాల్‌దాకా మనోళ్లకి బంగ్లా టీం చెమటలు పట్టించింది. ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ని మించిన ఉత్కంఠ కొనసాగింది. బంగ్లాదేష్ జట్టు బలపడిందా? బలంగా ఉందనుకుంటున్న మన జట్టు తుస్సు టపాసేనా!? ఒకటి మాత్రం పక్కా. టీమిండియా పర్‌ఫామెన్స్ నిలకడగా లేదు. ఇరగదీస్తారనుకున్నవారు బ్యాట్‌ ఎత్తేస్తున్నారు. పొదుపరులనుకున్న బౌలర్లు పరుగులు ధారపోస్తున్నారు.

అదృష్టం బావుండి వర్షం తగ్గి మళ్లీ మ్యాచ్‌ జరిగిందిగానీ లేకపోతే బంగ్లామీద ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చేది. టీ20 వరల్డ్‌కప్‌లో కొన్ని వండర్స్‌ జరిగినా బంగ్లాదేష్ మీద గెలిచేందుకు మనవాళ్లు ఈ రేంజ్‌లో చెమటలు కక్కాల్సి వస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. వర్షంఅలాగే కంటిన్యూ అయి డక్‌వర్త్‌ లూయిస్‌లో ఫలితం ప్రకటించి ఉంటే బంగ్లాదేష్ గెలిచుండేది. ఎందుకంటే ఆట ఆగే సమయానికి బంగ్లాదేష్ 17 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లి మిస్‌ ఫీల్డింగో, మనోళ్ల సుడిబాగుండో మొత్తానికి సెమీస్‌ గండంనుంచి గట్టెక్కాం.

కొందరు క్రికెట్‌ క్రీడాభిమానులకు మనం గెలిచినట్లు అనిపించడంలేదు. బంగ్లాదేష్ పోరాడి ఓడినట్లుంది. ఎందుకీ పరిస్థితి అన్న అంతర్మధనం మొదలైంది. ఫాంలోలేని ఆటగాళ్లు జట్టుకు భారమవుతున్నా, వరస వైఫల్యాలు కళ్లెదుట కనిపిస్తున్నా కొనసాగించడం మన జట్టు బలహీనత. సెలక్షన్‌ తప్పిదాలతోనే కొన్నిసార్లు ప్రపంచకప్‌లు చేజార్చుకున్నాం. కేఎల్‌ రాహుల్‌ టైంబాగుంటే ఆడతాడు. లేకపోతే లేదు. బంగ్లాదేష్ మీద మాత్రం మళ్లీ లైన్లోకొచ్చాడు. ఇక దినేష్‌ కార్తీక్‌, అశ్విన్‌, అక్షర్‌ వరసగా విఫలమవుతున్నా వారిని ఎందుకు కొనసాగిస్తున్నారన్నది సెలెక్టర్లకే తెలియాలి. మొహమాటానికి పోతే ‘ఏదో’ అవుతుందన్నట్లు మోతబరువును తగ్గించుకుంటేనే టీమిండియా నిలకడగా రాణిస్తుంది. లేకపోతే గెలుపు గాలివాటమే అవుతుంది.