దాదాపు నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా వేడెక్కించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఎట్టకేలకు ముగిసింది. పోలీచేసిన అభ్యర్థుల ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు వెల్లడయ్యేవరకు గెలుపు ఎవరిదనే ఉత్కంఠ తప్పదు. మునుగోడులో తమ పార్టీ గెలుపుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయానికి బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత బండి సంజయ్ ధ్వజమెత్తారు. గెలుపు తమదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపోతే పోలింగ్ ముగిసిన వెంటనే మునుగోడు ఉప ఎన్నిక పై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని స్పష్టం చేశాయి. థర్డ్ విజన్ రీసెర్చ్-నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా ప్రకారం టీఆర్ఎస్కు 48-51 శాతం ఓట్లు, బీజేపీకి 31-35 శాతం ఓట్లు, కాంగ్రెస్కు 13-15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం టీఆర్ఎస్కు 42-43 శాతం ఓట్లు, బీజేపీకి 38.5 శాతం ఓట్లు, కాంగ్రెస్కు 14-16 శాతం ఓట్లు, బీఎస్పీకి 3 శాతం, ఇతరులకు 1 శాతం వచ్చే ఛాన్స్ ఉంది. SAS గ్రూప్ సర్వే ప్రకారం టీఆర్ఎస్కు 41-42 శాతం ఓట్లు, బీజేపీకి 35-36 శాతం ఓట్లు, కాంగ్రెస్కు 16.5-17.5 శాతం ఓట్లు రావొచ్చని వెల్లడైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నిజం అవుతాయనే విషయంపై అనుమానాలు ఉన్నా…అసలైన విజేత ఎవరనేది తేలాలంటే కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఆగక తప్పదు.