ఢిల్లీకి ఎంత క‌ష్టం! దేశ రాజధానిలో స్కూళ్లు మూత‌

By KTV Telugu On 4 November, 2022
image

గాలి కూడా పీల్చ‌లేక‌పోతే ఎలా బ‌తికేది?

క‌రోనా టైంలో స్కూళ్లు మూత‌ప‌డ్డాయి. పిల్ల‌లు కంప్యూట‌ర్ల ముందే క్లాసుల‌కు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు ఢిల్లీలో ఆ వైర‌స్‌కి మించిన మ‌హ‌మ్మారి ముంచుకొచ్చింది. దీంతో మ‌ళ్లీ స్కూళ్లు మూత‌ప‌డ్డాయి.
దేశరాజధానిలో గాలి కాలుష్యం డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ప్రజలు గ‌డ‌ప‌దాటాలంటే భ‌య‌ప‌డుతున్నారు. కాలుష్య ప్ర‌భావంతో శ్వాస తీసుకోవడం కూడా క‌ష్ట‌మైపోతోంది. దీంతో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రాథమిక తరగతులను మూసేస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్‌లాగే సరి బేసి విధానం గురించి ఆలోచిస్తోంది. ఐదు నుంచి పై తరగతి విద్యార్థుల ఔట్‌డోర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ ఆపేసింది.

ఢిల్లీలో కొన్నాళ్లుగా వాయు కాలుష్యం ప్ర‌మాద‌క‌ర స్థాయిలో పెరుగుతోంది. ఎన్‌సీఆర్‌ పరిధిలో దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 400 మార్క్ దాటింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఢిల్లీలో ఏక్యూఐ 408గా నమోదైంది. వాయు కాలుష్యం యూపీలోని నోయిడాలో 393, హర్యానాలోని గురుగ్రామ్‌లో 318గా నమోదైంది. దేశ‌రాజ‌ధాని స్వేచ్ఛ‌గా గాలి పీల్చుకునే ప‌రిస్థితుల్లో లేక‌పోవ‌డం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం.

పంజాబ్‌లో పంట వ్యర్ధాల కాల్చివేత‌తో ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మించాలో ఆలోచించ‌కుండా బీజేపీ రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేస్తోంది. పంజాబ్‌లో పంట వ్య‌ర్ధాల కాల్చివేత‌పై నిందారోప‌ణ‌లు వ‌ద్దంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. వాయు కాలుష్యాన్ని ఉత్త‌రాది స‌మ‌స్య‌గా చూడాలంటున్నారు. రెండు పంట‌ల మ‌ధ్య త‌క్కువ స‌మ‌యం ఉండ‌టంతో రైతుల‌కు కూడా మంట‌పెట్ట‌టం త‌ప్ప మ‌రో మార్గంలేదు. అయితే వ‌చ్చే ఏడాది దీన్ని నిరోధిస్తామంటున్నారు కేజ్రీవాల్‌. కేంద్రం కూడా స‌మ‌స్య‌ను కేజ్రీవాల్ దృష్టితో చూడ‌టం మానేస్తేనే శాశ్వ‌త ప‌రిష్కారం దొరికేలా ఉంది.