మునుగోడు గెలిచినోడే రేపటి మొనగాడు

By KTV Telugu On 4 November, 2022
image

మరో రోజు గడిస్తే ఫలితం! ఏం జరుగుతుందోనని టెన్షన్?

నెలరోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉపపోరు ముగిసింది. ఇక, ఇప్పుడు అందరి దృష్టి 6న వెలువడే ఫలితాలపైనే పడింది. అయితే, అంతకంటే ముందే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ నేతలను సంతోషపరిస్తే…బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు నిద్రలేకుండా చేస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ దేనంటూ ఎగ్జిట్ పోల్స్ ఢంకా బజాయించాయి. సర్వే ఫలితాలన్నీ కారు దూసుకుపుతోందని తేల్చేయడంతో గులాబీ శ్రేణులు పట్టరాని సంతోషంతో ఉన్నారు. కానీ, అదెంతవరకు నిజమవుతుందో తెలియని పరిస్థితుల్లో కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇక, బీజేపీ పైకి తమదే విజయమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, టెన్షన్ ఫీలవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. హస్తం పార్టీ మూడోస్థానానికే పరిమితమవుతుందన్న విశ్లేషణలు, సర్వే ఫలితాల నేపథ్యంలో తెగ హైరాన పడిపోతున్నారు. స్వతంత్య అభ్యర్థులు, చిన్నాచితకాపార్టీలు అడ్డుగోడగా నిలవడం…ప్రధాన పార్టీలను కంగారుపెడుతోంది.

మునుగోడు ఉపఎన్నిక

మిగతా ఎన్నికలతో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్. దుబ్బాక, హుజూరాబాద్ ను మించి అక్కడ రాజకీయం సెగలు కక్కింది. ఎందుకంటే, రాబేయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉపఎన్నికను సెమీఫైనల్ గా భావించిన ప్రధాన పార్టీలు…ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ రసవత్తర పోరు సాగింది. ఇది తమ భవితవ్యాన్ని తేల్చే ఎన్నిక కావడంతో శక్తియుక్తులన్నీ ప్రదర్శించాయి. మునుగోడును గెలిస్తే ఫైనల్ ఫైట్ ఈజీ అవుతుందన్న అంచనాతో చివరి సెకన్ వరకు అహోరాత్రులు శ్రమించారు. దాడులు, నేతల జంపింగ్ ల దగ్గర్నుంచి ఓటర్లను ప్రలోభ పెట్టడం వరకు ఎన్ని చిత్రాలు జరగాలో అన్ని జరిగాయి. రాష్ట్ర స్థాయిలోని నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు. అన్ని పార్టీల నేతలు డబ్బు, మద్యం ఏరులై పారిచ్చారు. కార్లు, బైకులు, బంగారం, బహుమతులు కోరుకున్నవారికి కోరినంత అన్నట్టుగా తాయిలాలు ఇచ్చారు. అయితే, ఇంత చేసినా ఓటర్ల నాడిని మాత్రం పసిగట్టలేకపోతున్నారు. 6న ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆందోళనతో గుండె చేత పట్టుకుని ఉన్నారు. మునుగోడు ఫలితాల ప్రభావం ఎలాంటి మలుపులు తీసుకోబోతుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో గెలిచే మొనగాడే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటాడన్న అంచనాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలకే కాదు రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న చిన్నా చితకా పార్టీల అభ్యర్థులకు ఈ ఉప ఎన్నిక కీలకం కానుంది.

గల్లీలో గెలిస్తే ఢిల్లీకి జెట్ స్పీడ్ తో కారు
మునుగోడులో అధికార పార్టీ గెలిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి అదే ఊపులో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. ఆ తర్వాత హస్తినకు కారు స్పీడ్ తో దూసుకెళ్లగలుగుతుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపొంతరం చెందుతున్న తరుణంలో జరిగిన చివరి ఎన్నికలు కాబట్టి, ఇదే జోష్ దేశమంతా చూపాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్. ఇప్పటికే ఎమ్మెల్యేల ప్రలోభాల విషయంలో దేశవ్యాప్తంగా బీజేపీ పరువు తీశారు. ఆడియోలు, వీడియోలు అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నారు. మోడీని ఢీకొట్టే సత్తా తనకే ఉందనే ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ప్రజల తీర్పు చారిత్రాక తీర్పు అవుతుందని కేసీఆర్ ఇటీవల బహిరంగసభలో వ్యాఖ్యానించారు. తాను ఢిల్లీ వెళ్లేందుకు మార్గం సుగుమం చేస్తుందనే విషయాన్ని ప్రస్తావించారు. ఇక, కమ్యూనిస్టులు తమతో కలిసివచ్చినందువల్ల గెలుపుపై ధీమాతో ఉన్నారు గులాబీ నేతలు. ఒకవేళ ఫలితాలు తారుమారైతే అది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కేసీఆర్ ఢిల్లీదాకా వెళ్లడమేమో గానీ, గల్లీలోనే కమలనాథులు నిలువరించే పరిస్థితి ఎదురవుతుంది.

మునుగోడుపైనే బీజేపీ ఆశలన్నీ
దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో గెలుపు బీజేపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంచింది. మునుగోడులో గెలిస్తే మరింత అదనపు బలం వస్తుంది. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం తామేనంటున్న కమలనాథులు వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామని చెబుతున్నారు. మునుగోడులో కమలం వికసిస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి పెద్దసంఖ్యలో వలసలుంటాయని కాషాయదళం భావిస్తోంది. ఓడితే మాత్రం ఆపరేషన్ ఆకర్ష్‌ ఆగిపోయి బలమైన నేతల వలసకు బ్రేక్‌ పడే ఛాన్స్‌ ఉంది. అది అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నల్గొండలో కోమటిరెడ్డి బ్రాండ్, కాంగ్రెస్ ఓట్లన్నీ తమకే పడతాయనే ఆశతో మునుగోడు ఉపఎన్నికకు వెళ్లింది. కానీ, అది ఎంతమేరకు వర్కవుట్ అవుతుందనేది ఫలితాల్లో తేలనుంది. అయితే, బీజేపీ ప్రతినిథులుగా చెప్పుకుంటున్న కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన ఆడియోలు, వీడియోలు బయటకు రావడం ఆ పార్టీకి మైనస్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ బతకాలంటే కచ్చితంగా గెలవాల్సిందే
ఇక కాంగ్రెస్‌ కి ఈ గెలుపు అనివార్యం కానుంది. తెలంగాణ తెచ్చింది-ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్నప్పటికీ, ఓట్లను రాబట్టడంలో మాత్రం విఫలమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి వరుస ఓటములతో సతమతమవుతోంది. బీజేపీని బలమైన ప్రతిపక్షంగా మార్చే పరిస్థితికి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఈ ఎన్నిక ఓ అగ్నిపరీక్ష అనే చెప్పాలి. హుజూరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవడంతో రేవంత్ తీవ్ర విమర్శల పాలయ్యారు. అందుకే, మునుగోడులో అంతా తానై వ్యవహరించారు. కొనఊపిరితో ఉన్న కాంగ్రెస్ బతకాలన్నా, శ్రేణుల్లో ఉత్సాహం నింపాలన్నా, వలసలను ఆపాలన్నా ఈ మునుగోడు ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ కు తప్పనిసరిగా మారింది. రాహుల్ పాదయాత్ర, స్రంవతిపై ఉన్న సింపథీ తమను గెలిపిస్తుందనే ఆశలు పెట్టుకుంది హస్తం పార్టీ. ఓడిపోతే మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశముంది.