తెలంగాణలో షర్మిలను ఎవరైనా పట్టించుకుంటున్నారా ?

By KTV Telugu On 5 November, 2022
image

తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్ర ఒక వారధిగా మారింది కొందరు నాయకులకు. ప్రజలకు దగ్గరయ్యేందుకు దీన్ని తిరుగులేని అస్త్రంగా భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ పాదయాత్రలు చేశాకే అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేశారు. మరోవైపు వైఎస్‌ఆర్‌ కుమార్తె షర్మిల కూడా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. అక్రమాస్తుల ఆరోపణల కేసులో జగన్‌ జైలుకు వెళ్ళినప్పుడు పార్టీని కాపాడటంకోసం షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. అప్పటికి ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. కేవలం అన్న కోసమే ఆమె యాత్ర చేశారు. ఆ తరువాత పలు కారణాల వల్ల షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించారు. అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పాదయాత్ర ప్రారంభించారు.  గత సంవత్సరం అక్టోబర్ 20న రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారు.

పాదయాత్రలో టీఆర్ఎస్‌ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలపై ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను, కేటీఆర్‌ను కూడా ఆమె విమర్శిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులపై షర్మిల చేసిన ఆరోపణలు రాజకీయంగా వేడి పుట్టించాయి. దాంతో టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా కూడా షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇంత కష్టపడి ఆమె తెలంగాణలో చేస్తున్న పాదయాత్ర వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు ఎక్కడా వినిపించడంలేదు. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన హుజూరాబాద్‌, మునుగోడు ఉపఎన్నికల్లో షర్మిల పోటీ చేయలేదు. దీంతో అసలు వైఎస్ఆర్ టీపీ గురించి ఎక్కడా చర్చ జరగలేదు. షర్మిలకు ప్రధానంగా స్థానిక సమస్య ఎదురవుతోంది. తాను తెలంగాణా కోడలినని ఆమె చెప్పుకుంటున్నా ఆమెను ఆంధ్రా మహిళగానే చూస్తున్నారు జనం. పైగా ఆ పార్టీలో షర్మిల తప్ప కాస్త పేరున్న నాయకుడు ఎవరూ లేరు. అది కూడా మైనస్‌గా మారింది. అయినా షర్మిల మాత్రం పాదయాత్ర కొనసాగిస్తునే ఉన్నారు. ఎవరూపట్టించుకోకపోయినా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరతానని అనుకుంటున్నారు షర్మిల.