మూసేసిన దుకాణంకి కొత్త వాచ్‌మాన్‌

By KTV Telugu On 5 November, 2022
image

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌
ఉనికి లేని పార్టీకి అడ్రసు లేని అధ్యక్షుడు

తెలంగాణ గడ్డపై పురుడు పోసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మలుపు తిప్పిన తెలుగుదేశం పార్ఠీ ఇప్పుడు తెలంగాణాలోనే అడ్రసు లేకుండా పోయింది. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో రాజకీయాలను మలుపు తిప్పిన టీడీపీ ఇప్పుడు పాడుబడిన సత్రంలాగా మారిపోయింది. తమది జాతీయ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణలో మాత్రం టీడీపీని గాలికొదిలేశారు. నామ్‌కే వాస్తే అన్నట్లు తన బంటును ఒకరిని ఇక్కడ అధ్యక్షుడిగా నియమించి చేతులు దులుపుకున్నారు. ఒకప్పుడు పార్టీ కార్యకలాపాలతో నిత్యం సందడిగా ఉండే ఎన్టీయార్ భవన్‌ ఇప్పుడు చెదలు పట్టిపోయింది. ఆ భూత్‌ బంగళాకు చంద్రబాబు కొత్త వాచ్‌మెన్‌ను ప్రకటించారు. అర్థం కాలేదు కదా…? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సరికొత్త అధ్యక్షుడిని నియమించారు. కాసాని జ్ఞానేశ్వర్‌ అనే లీడర్‌ను తీసుకొచ్చి టీటీడీపీకి ప్రెసిడెంట్‌గా అనౌన్స్‌ చేశారు. అతీగతీ లేని పార్టీని ఈ కొత్త అధ్యక్షుడు ఏం చేస్తాడు అనుకోకండి… ఏమీ చేయలేము అని చంద్రబాబుకు కూడా తెలుసు.

సాక్షాత్తూ చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్నా తెలంగాణలో టీడీపీకి ప్రాణం పోసి నిలబెట్టడం అసాధ్యం. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ పార్టీకి అధ్యక్షుడిగా ఎల్ రమణను చంద్రబాబు నియమించారు. ఈ తెలుగుదేశాన్ని నమ్ముకుంటే జీవితమంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవుతుందని భయపడిన ఎల్ రమణ టి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్సీ అయిపోయారు. ఆ తర్వాత బక్కని నరసింహులును ప్రెసిడెంట్‌ను చేశారు చంద్రబాబు. నాయకులు కార్యకర్తలు లేని పార్టీకి అధ్యక్షుడిగా ఆయన కొన్నాళ్లు పనిచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేద్దామని బాబుగారిని ఒప్పించడానికి ట్రై చేశారు. కానీ చంద్రబాబు ఒప్పుకోలేదు. చివరికి ఆయన్ను పీకేసి పార్టీ పోలిట్ బ్యూరోలో కూర్చోబెట్టి అధ్యక్షత స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్ చేతుల్లో పెట్టారు. విచిత్రం ఏమిటంటే ఈయన ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి ఆ తరువాత వెళ్లిపోయినవాడే. అయిపోయిన పెళ్లికి బాజాలెందుకన్నట్లు చాప్టర్‌ క్లోస్‌ అయిపోయాక ఎవరిని తీసుకొచ్చి పెడితే ఏం లాభం ?