ఆనాటి వెన్నుపోటులో ఆ ఆరుగురు కూడా ఉన్నారన్న వెంకయ్య
అలా జరుగుతుందని తనకు ముందే తెలుసన్న వెంకయ్య
చంద్రబాబు నాయుడు తన మామ అయిన ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారన్న సంగతి తెలుగు ప్రజలందరికీ తెలుసు. పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా చంద్రబాబు తనకు చేసిన ద్రోహాన్ని భరించలేక ఎన్టీరామారావు మానసికంగా కుంగిపోయి ఆ అవమానభారంతో చనిపోయారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో వెన్నుపోటు ఒక మరకగా మిగిలిచిపోయింది. అయితే ఆనాడు జరిగింది వెన్నుపోటు కాదని వాదిస్తారు చంద్రబాబు. ఇటీవల అన్‌స్టాపబుల్ టాక్‌షోలో కూడా తన బావమరిది బాలయ్యతో ఇదే విషయం చెప్పారు. ఆరోజు మనం చేసింది తప్పా అని ప్రశ్నించారు. కాళ్లు పట్టుకుని బతిమిలాడానని అయినా ఎన్టీరామారావు వినిపించుకోలేదని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. అయితే అది వెన్నుపోటే అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమనూరులో సహజ ఉత్పత్తుల కేంద్రాన్ని సందర్శించిన వెంకయ్యనాయుడికి కొందరు మహిళలు పాదాభివందనం చేశారు. అలా మహిళలు కాళ్లు మొక్కడాన్ని చూసిన వెంకయ్యనాయుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో ఎన్టీఆర్ వద్దకు కొందరు మహిళ నాయకురాళ్లు వచ్చి కాళ్లు మొక్కేవారని దానిపై తాను ప్రశ్నించగా.. వారి ప్రేమ, అనురాగం అలాంటిదని ఎన్టీఆర్ చెప్పారన్నారు. ఆ మహిళలు వెళ్లిపోయిన తర్వాత ప్రేమ లేదు పిండాకూడు లేదని ఎన్టీఆర్‌తో తాను చెప్పానన్నారు. ఆరోజు ఎన్టీఆర్‌కు కాళ్లు మొక్కిన ఆరుగురు మహిళలే వెన్నుపోటు ఘట్టంలో ముందున్నారని వెంకయ్యనాయుడు అనేశారు. దాంతో అప్పట్లో ఎన్టీఆర్‌కు జరిగింది వెన్నుపోటేనని ఆయన కూడా నిర్ధారించినట్టు అయింది. గతంలో కూడా వెంకయ్య నాయుడు ఒకసారి వెన్నుపోటు ఘట్టాన్ని ప్రస్తావించారు . 2016లో అనంతపురం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా తన వెనుక చాలా మంది నిలబడి ఉండడాన్ని గమనించిన వెంకయ్యనాయుడు నా వెనుక నిలబడవద్దు. వెనుక నిల్చోబెట్టుకోవడం వల్ల ఎన్టీఆర్‌కు ఏమైందో తెలుసు కదా ? అన్నారు. ఇప్పుడు కూడా వెన్నుపోటు ఘటన గురించి వ్యాఖ్యానించి చంద్రబాబుకు షాకిచ్చారు. అదిసరేగానీ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఆ ఆరుగురు మహిళలు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.