ఏపీలో టీడీపీని వెనక్కి నెడుతున్న జనసేన

By KTV Telugu On 6 November, 2022
image

చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడ్డానికే పనిచేస్తాడని ముద్ర పడిన పవన్‌ కళ్యాణ్ ఈ మధ్య గేరు మార్చారు. చంద్రబాబుకు అవసరం పడినప్పుడల్లా బయటకొచ్చి హడావుడి చేసి వెళ్లిపోతాడని టీడీపీ ఆఫీసు నుంచి వచ్చి స్క్రిప్టు చదివి ప్యాకేజీ తీసుకుంటాడని పవన్ ను వైసీపీ నాయకులు విమర్శిస్తారు. వీకెండ్‌ పొలిటిషన్‌ అని దత్తుపుత్రుడు అని కూడా ఆయన్ను దెప్పిపొడుస్తారు. జనసేన పార్టీని 2014లో ఏర్పాటు చేసినా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారు పవన్‌. 2019లో విడిగా పోటీ ఒకే ఒక్క చోట గెలిచారు. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తరువాత కూడా పవన్‌ రాజకీయాలను సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. ఇప్పటికీ నాదేండ్ల మనోహర్‌ తప్ప ఆ పార్టీలో చెప్పుకోదగిన నాయకులు ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ముద్ర పడిన జనసేన ఈమధ్య ఉన్నట్లుండి గేరు మార్చింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం, కులమతాలను ప్రస్తావిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో ఆయన ఆరితేరిపోయారు.

వైజాగ్‌ పర్యటనకు వెళ్లి రచ్చ రచ్చ చేయడం, వైజాగ్‌ ఎయిర్‌పోర్టు వద్ద వైసీపీ మంత్రుల మీద దాడికి తెగబడడం, మంగళగిరి సభలో వైసీపీ నాయకులను చెప్పు చూపిస్తూ బండ బూతులు తిట్టడం ఇలాంటి చేతల ద్వారా తాము ఏపీలో వైసీపీకి బలమైన ప్రత్యామ్నాయం అని చాటుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఇప్పుడు ఆయన ఇప్పటం గ్రామానికి వెళ్లి అక్కడ కూల్చివేసిన ఇళ్ల వద్ద చేసిన హడావుడి అందరి దృష్టిని ఆకర్షించింది. మీడియాలో కూడా హైలెట్‌ అయ్యింది. పవన్‌ అవలంభిస్తున్న ఎజెండా కారణంగా కొన్నిరోజులుగా వార్తల్లో జనసేన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జనసేన హోరులో తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు పవన్‌తో చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్‌ ఏ కార్యక్రమం చేపట్టిన ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కానీ వారిలో ఎంత మంది ఆయనకు ఓటేస్తారనేది అనుమానమే.