మునుగోడులో టీఆర్ఎస్ గట్టెక్కింది. ప్రత్యర్థి బీజేపీని మట్టి కరిపించి ఆ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకుంది. బీజేపీలో చేరినందుకు రాజీనామా చేసి పోటీ పడిన రాజగోపాల్ రెడ్డి ఓటమితో కృంగిపోక తప్పదు. గత ఎన్నికల్లో ఓడి ఇంటికి పరిమితమైన కూసుకుంట్లకు పిలిచి ఎమ్మెల్యేను చేసినట్లయ్యింది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్నదని ఓప్పుకోక తప్పదు..
మునుగోడులో టీఆర్ఎస్ జయకేతనం
కమలాన్ని ఖంగుతినిపించిన కారు
రెండు రౌండ్లు మినహా అన్నింటా గులాబీ గులాళింపు
టీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూసిన ఫలితం వచ్చింది. గ్రామీణ నియోజకవర్గం మునుగోడులో టీఆర్ఎస్ అసాధారణ విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అనూహ్యంగా వచ్చిన ఉప ఎన్నికలతో అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకుంది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి రెండు రౌండ్లు మినహా ప్రతీ దశలోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కనిపించింది. కేసీఆర్ వ్యూహం ఫలించడంతో అతిగా ఆవేశపడి ఎన్నిక తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.
గ్రామానికో ఎమ్మెల్యే మోహరింపు
మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు
హైదరాబాద్ నుంచే నడిపించిన కేసీఅర్
అన్నీ తామై నిర్వహించిన కేటీఆర్, హరీష్
మునుగోడు విజయం అంత సులభం కాదని కేసీఆర్ ముందే గ్రహించారు. ప్రత్యర్థికి అర్థం కాని వ్యూహాలు అమలు చేస్తేనే కొంతైనా గెలిచే అవకాశాలున్నాయని గులాబీ దళపతి అర్థం చేసుకున్నారు. దానితో గ్రామానికో ఎమ్మెల్యేను పంపి అక్కడి ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు కూడా తమ సర్వసైన్యాధ్యక్షుడి ఆదేశాలు తూచ తప్పకుండా పాటించారు. మునుగోడులో ఎంత డబ్బుల వెదచల్లారో లెక్కలు కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఒక్క సారి మాత్రమే గంట సేపు మునుగోడు నియోజకవర్గానికి వెళ్లిన కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే మొత్తం మంత్రాంగం నడిపించారు. కేటీఆర్, హరీష్ రావు క్షేత్రస్థాయిలోకి దిగి అధినేత వ్యూహాలను అమలు జరిపారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కేటీఆర్ ఇచ్చిన హామీ ఓటర్లపై బాగానే పనిచేసింది. హామీ నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది..
డబ్బు పంచడంలో బీజేపీ కాస్త వెనుకంజ
కొంత మేర పనిచేసిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
పోలింగ్ బూత్ స్థాయిలో బీజేపీకి కేడర్ సమస్య
వ్యూహాల్లోనూ వెనుకబడిపోయిన కమలం
గెలిచి తీరాలన్న కసితో పనిచేసి టీఆర్ఎస్ అనుకున్నది సాధించింది. తెలంగాణ విత్ కేసీఆర్ అన్న హరీష్ రావు ట్వీట్ అందుకే అతికినట్లు సరిపోవచ్చు. సరిగ్గా ఎన్నికలకు ముందు కేసీఆర్ తెలివిగా బయటకు తీసిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బీజేపీని దెబ్బతీసిందనే చెప్పాలి. అప్పటి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న పోటీ.. టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి కూడా ఫామ్ హౌస్ ఘటన పనిచేసింది. ఆ దిశగానే ఐదారు వేల ఓట్లు కోల్పోయి ఉంటామని బీజేపీ నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. తమ బలం తెలుసుకోకుండానే ఉప ఎన్నిక తెప్పించామని బీజేపీ నేతలు అంటున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు లేకపోవడంతో దెబ్బతిన్నమని చెబుతున్నారు. మరో పక్క ప్రతీ వీధికి టీఆర్ఎస్ ఒక గ్రూపును ఏర్పాటు చేసి వారికి ఒక నాయకుడని పెట్టి మంత్రాంగం నడిపించింది.
కాంగ్రెస్ దెబ్బతినడం కూడా బీజేపీకి షాకే
ముక్కోణ పోటీగా మార్చలేకపోయిన కాంగ్రెస్
ఓట్లు చీల్చలేకపోయిన స్రవంతి
కొన్ని గుర్తులతో ఇబ్బంది పడిన టీఆర్ఎస్
మంత్రులకు సైతం షాకిచ్చిన ఓటర్లు
రాజగోపాల్ రెడ్డి నిష్క్రణమతో కాంగ్రెస్ దెబ్బతిన్నది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తరపున పాల్వాయ్ స్రవంతిని పోటీ చేయించాల్సి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికను ముక్కోణ పోటీగా మార్చడంతో ఆమె వైఫల్యం చెందారు. దానితో బీజేపీ కూడా ఇబ్బంది పడింది. స్రవంతి కనుక టీఆర్ఎస్ ఓట్లను చీల్చగలిగితే స్వల్ప మెజార్టీతోనైనా బీజేపీ గెలిచేది. ఇప్పుడు స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. నిజానికి రోడ్ రోలర్, రొట్టెల కర్ర లాంటి గుర్తులతో తమకు ఇబ్బందిగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ మొరపెట్టుకుంది. వాటిని తొలగించడానికి ఈసీ అంగీకరించలేదు. చివరకు టీఆర్ఎస్ భయపడినట్టే జరిగింది. అభ్యర్థులెవ్వరో తెలియకపోయినా అలాంటి గుర్తులకు నాలుగు నుంచి ఐదు వేల ఓట్లు పడ్డాయి. లేకపోతే ఆ ఓట్లు టీఆర్ఎస్ కు వచ్చి మెజార్టీ మరింత పెరిగేది. మరో పక్క మునుగోడు ఒక విచిత్రమైన ఎన్నికగా భావించాలి. మంత్రులు పనిచేసిన ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యం సాధించింది. ఏదేమైనా టీఆర్ఎస్ విజయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు దారి తీసే అవకాశం ఉంది..