నల్గొండలో మొత్తం పింక్ పార్టీ ఎమ్మెల్యేలే..

By KTV Telugu On 7 November, 2022
image

జగదీశ్వర్ రెడ్డి మార్క్ రాజకీయం నల్గొండ గులాబీమయం
సరిలేరు తమకెవ్వరు అంటూ దూసుకెళ్తోన్న కారు
మూడు ఉపఎన్నికల్లోనూ ఎగిరిన గులాబీ జెండా

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన మునుగోడు బై పోల్ లో గులాబీ పార్టీ సత్తా చాటింది. సరిలేరు తమకెవ్వరూ అంటూ కారు దూసుకెళ్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. మునుగోడు గెలుపుతో జిల్లా మొత్తం గులాబీమయమైంది. అంతేకాదు, జిల్లాలో జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయదుందుభి మోగించడం విశేషం. తరతరాలుగా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నల్గొండ గడ్డను తమకు అడ్డాగా మల్చుకుని మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది గులాబీ పార్టీ. మొత్తం 12 నియోజకవర్గాల్లో 12 మంది పింక్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, జానారెడ్డి లాంటి ఉద్దండులున్న జిల్లాలో హస్తం పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కేసీఆర్ వ్యూహాలు, కారు స్పీడును తట్టుకోలేక కాంగ్రెస్ ఖల్లాసైపోయింది. మునుగోడుతో పాటు జిల్లా ప్రజానీకానికి టీఆర్ఎస్ ప్రణమిల్లుతోంది. ప్రభుత్వ పథకాలు ఫ్లోరైడ్ సమస్య నుంచి నల్గొండ ప్రజలను ఏవిధంగా విముక్తి చేశామో చెబుతూ ఓటర్ల మనసు గెలుచుకోగలిగింది టీఆర్ఎస్.

2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు, నకిరేకల్, హుజూర్‌నగర్ తప్ప మిగిలిన 9 నియోజకవర్గాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019లో నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అక్కడ మరోసారి టీఆర్ఎస్ సైదిరెడ్డిని బరిలో దింపగా ఉత్తమ్ తన సతీమణిని పోటీ చేయించారు. ఈ బైపోల్ లో సైదిరెడ్డి 43వేల ఓట్లతేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో వచ్చిన నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కూడా టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పై పోటీ చేసిన నరసింహయ్య కుమారుడు నోముల భగత్ 18వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలా రెండు సార్లు తండ్రీ కొడుకుల చేతుల్లో జానా పరాజయం పాలయ్యారు. ఇక, తాజాగా మునుగోడులో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,341 ఓట్ల తేడాతో గెలిచారు. 2018లో నకిరేకల్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు.

ముఖ్యంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేరు జిల్లాలోనే కాదు రాష్ట్రమంతా మార్మోగుతోంది. కేసీఆర్ నమ్మిన బంటుగా పేరొందిన జగదీశ్వర్ రెడ్డి జిల్లాలో జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి మరింత బలోపేతం చేశారు. కేసీఆర్ నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతను వందశాతం నెరవేర్చి జిల్లాలో గులాబీ జెండాను రెపరెపలాడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మూడు ఉపఎన్నికలకు ఇంఛార్జ్ జగదీశ్వర్ రెడ్డినే. ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సఫలీకృతమయ్యారు. వరుసగా రెండు సార్లు సూర్యాపేట నుంచి గెలిచిన జగదీశ్వర్ రెడ్డిని, రెండు పర్యాయాలు కేబినెట్ లోకి తీసుకున్నారు కేసీఆర్. జిల్లాలో జరిగే ప్రతీ ఎన్నికలోనూ తనదైన మార్కు చూపిస్తూ వస్తున్న జగదీశ్వర్ రెడ్డి, ముచ్చటగా మూడో ఉపఎన్నికను గెలిపించి ఓటమెరుగని నేతగా పేరుగడించారు. 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్, మునుగోడులో ఓడిపోయిన అభ్యర్థులనే మళ్లీ ఉపఎన్నికల్లో నిలిపి టీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. నాగార్జున సాగర్ లో మాత్రం నరసింహయ్య మృతితో ఆయన తనయుడిని పోటీలో నిలిపి గెలిపించుకుంది. మొత్తానికి జిల్లా మొత్తం గులాబీ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కారు మరే పార్టీకి సైడ్ ఇవ్వకుండా షికారు చేస్తోంది.