గుక్కపెట్టిన పాపాయిలా మన రూపాయి!
గుక్కపెట్టిన పాపాయిలా మన రూపాయి ఘొల్లుమంటోంది. పతనంలో కొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి పతనం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల పెంపుకు తోడు ఇతర దేశీయ కారణాలతో సెప్టెంబర్ 27న రూపాయి విలువ 82కు పతనమైంది. అక్టోబర్ 19న అంతర్జాతీయ ద్రవ్య మార్కెటులో డాలరుతో రూపాయి మారక విలువ ఏకంగా 79 పైసలు కోల్పోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి మారకం విలువ మరింత పతనమయ్యేలా ఉంది. గత ఎనిమిదేళ్లలో డాలరు మారకంతో రూపాయి విలువ 26.39 శాతం పతనమైంది. అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడం స్టాక్ మార్కెట్లతో పాటు రూపాయిపై ప్రభావం చూపింది. భారత్ ఫారెక్స్ నిల్వలు 545 బిలియన్ల డాలర్లకు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూలతకు దారితీస్తోంది. ఫారెక్స్ నిల్వలు మళ్లీ కొంత పుంజుకున్నా రూపాయి మాత్రం బలపడటం లేదు.
అమెరికా వడ్డీరేట్లకు మన రూపాయికి సంబంధమేంటన్న ప్రశ్నతలెత్తుతుంది. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగినప్పుడు మదుపరులు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. ఎక్కువ ఆదాయం కోసం అమెరికావైపు మళ్లుతారు. దీంతో డిమాండ్ పెరిగి డాలర్ మరింత బలపడుతుంది. అందుకే ఇటీవలి పరిణామాలతో డాలర్ విలువ రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లతో డాలర్ బలపడడం, భారత ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి, స్తబ్దుగా ఉన్న చమురు ధరలకు తోడు దేశ వాణిజ్య లోటు పెరగడం రూపాయి మరింత బక్కచిక్కేలా చేశాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు షేర్లు, బాండ్లను విక్రయించటంతో డాలర్ తెగ బలిసిపోతోంది.
మన రూపాయి విలువ తగ్గుతున్న కొద్దీ దిగుమతుల భారం పెరుగుతోంది. డాలర్ విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గినట్లు కనిపిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భాష్యం చెప్పారు. వాస్తవానికి డాలర్ మాత్రమే బలపడితే రూపాయి మారకం విలువ దాంతోనే పడిపోవాలి. కాని పౌండ్, యూరోతో పోల్చినా ఎందుకు క్షీణిస్తోందన్న ప్రశ్నకు సమాధానం లేదు. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయాల్సివచ్చేలా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా పౌండ్తో రూపాయి మారక విలువ దిగజారటం ప్రమాదకర పరిణామం. భారత ద్రవ్యలోటు ప్రస్తుతం జీడీపీలో 10 శాతందాకా ఉంది. ఏ దేశంలోనైనా కరెన్సీ విలువ తగ్గిపోయి ద్రవ్యోల్బణం పెరిగితే విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. దాంతో రూపాయి విలువ మరింత పడిపోయి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ప్రజల జీవనప్రమాణాలను దారుణంగా దిగజారుస్తుంది.
విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో ఫారెక్స్ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ జోక్యం అంతంత మాత్రంగానే ఉంది. ఫారెక్స్ ట్రేడర్లు రూపాయిల్ని భారీగా విక్రయించి డాలర్లుగా మార్చుకుంటున్నారు. దీంతో దేశీయ కరెన్సీ పతనం ఆగడం లేదనేది ఇన్వెస్టర్ల విశ్లేషణ. రూపాయి రక్షణకు ఆర్బీఐ కొంత విదేశీ కరెన్సీ ఖర్చు చేయాల్సివస్తోంది. దీంతో ఏడాది కాలంగా మన చేతుల్లోని విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. సంవత్సరాంతానికి విదేశీ మారక నిల్వలు 500 బిలియన్ డాలర్లదాకా పడిపోవచ్చని అంచనా వేస్తున్నాయి. దేశ జీడీపీలో 84 శాతానికి రుణ భారం చేరిందని ఐఎంఎఫ్ ప్రకటించింది. మరోవైపు అంతర్జాతీయంగా భారత్ రుణ పరపతి ప్రమాదంలో పడిందని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ హెచ్చరించింది.
రూపాయి పతనం ప్రజలందరిమీదా ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే రూపాయి విలువ తగ్గేకొద్దీ దిగుమతులు భారం అవుతాయి. చమురు, ఎలక్ట్రానిక్స్లాంటి దిగుమతి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ముడి సరుకుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి కారణం అవుతాయి. రూపాయి పతనంతో పరిశ్రమలు, సేవారంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత క్షీణిస్తుంది. చివరికి రాష్ట్రాలు, కేంద్రం కూడా చేసిన అప్పులు తీర్చలేని దుస్థితి రావచ్చు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలి ఇన్వెస్టర్లు భారీ ఎత్తున నష్టపోక తప్పదు. దేశంలో ఉత్పత్తులను పెంచకుండా దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. భారీగా బొగ్గునిల్వలున్నా దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. సువిశాల దేశంలో కోట్ల ఎకరాల భూములున్నా పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజలకోసం విదేశాల మీద ఆధారపడుతున్నాం. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తిరోగమనంలో ఉంది.
ప్రపంచ వృద్ధి రేటు 2022లో 3.2 శాతం, 2023లో 2.7 శాతం ఉండవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు కుంగిపోతుందనే అంచనాలున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా ఆర్థిక వ్యవస్థలు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు త్వరితంగా ప్రభావితమయ్యే మన రూపాయి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. రూపాయి ఎందుకు పడిపోతోందంటే చేపా చేపా ఎందుకు ఎండలేదన్న చొప్పదంటు ప్రశ్న ఎదురవుతుంది. పాలకులు ఆర్థికవ్యవస్థని బలోపేతం చేసేందుకు నిజాయితీగా నిర్ణయాలు తీసుకోనంత కాలం మన రూపాయి పాపాయిని బుజ్జగించడం కష్టమే!