టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతల విమర్శలు పెరిగేవి
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాగే పని జోరందుకునేది
మునుగోడు ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ టీఆర్‌ఎస్ విజయం సాధించింది. మునుగోడు ఓటర్లు కేసీఆర్ పట్ల తమ విశ్వాసం వ్యక్త చేశారు. అదేగనక అక్కడ బీజేపీ గెలిచి ఉంటే కథ వేరేలా ఉండేది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే తెలంగాణ రాజకీయంలో కలకలం రేగేది. ఇక తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ పతనం ఖాయం అని బీజేపీ పెద్ద ఎత్తున ఊదరగొట్టేది. దాంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం కూడా ప్రారంభం అయ్యేది. మునుగోడు ఉప ఎన్నికకు ముందే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుని బీజేపీ పెద్ద రాజకీయ డ్రామాకే తెర లేపే ప్రయత్నం జరిగిందని కేసీఆర్ ఆరోపించారు. మరి మునుగోడులో కమలం గెలిచి ఉంటే? అదిగో ఎమ్మెల్యేలు ఇదిగో శిబిరం! అన్నట్టుగా మారేది పరిస్థితి. టీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేసేవారేమో!
కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని, తమతో కొందరు చేతులు కలుపుతున్నారని బీజేపీ నేతలు హడావుడి చేసేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకుపోవడానికి రెడీగా ఉన్నట్లు బీజేపీ నేతల ప్రసంగాలు దుమ్ములేచేవి. అయితే మునుగోడులో వారి అభ్యర్థి ఓటమి పాలవ్వడంతో బీజేపీ కిక్కురుమనలేని పరిస్థితుల్లో ఉంది. తమ ఊపు కొనసాగుతోందని చెప్పుకోవడానికి కానీ, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు తమ వైపుకు వస్తున్నారని, కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పుకునే వీల్లేని పరిస్థితుల్లోకి నెట్టేసింది ఈ ఉప ఎన్నిక ఫలితం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉందనంగా జరిగిన ఈ ఉప ఎన్నిక ఫలితం పెద్ద పొలిటికల్ డ్రామాను తప్పించింది. మునుగోడు ఎఫెక్టుతో బీజేపీ కాస్త జోరు తగ్గిస్తుంది. క్యాడర్‌లోనూ ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఇప్పటినుంచి అసెంబ్లీ ఎన్నికల వరకూ ఉత్తుత్తి సవాళ్లు, రచ్చలే మనం చూడాల్సి ఉంటుంది.