ఆ మహిళా ఐఏఎస్‌కి గ్రహణం వీడింది

By KTV Telugu On 8 November, 2022
image

ఎన్నో నిందలు.. ఇప్పుడామె కడిగిన ముత్యం

ఆమె ఐఏఎస్‌. ఎన్నో ఆశలతో, లక్ష్యాలతో కలెక్టర్‌ స్థాయికి ఎదిగారు. తర్వాత సెక్రటరీ స్థాయిలో పదవులు అందుకున్నారు. ఉన్నతాధికారిణిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించారు. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఉద్యోగధర్మాన్ని పాటించినందుకు జైలు పాలు కావాల్సి వస్తుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. తన తప్పేమీలేదన్నా చట్టం తన పనితాను చేసుకుపోయింది. గాంభీర్యంగా పాలనాయంత్రాంగాన్ని పరుగులుపెట్టించే ఐఏఎస్‌ జైలు గోడలమధ్య మగ్గుతుంటే, అనారోగ్యంతో నడవలేని పరిస్థితుల్లోనూ కోర్టు బోనెక్కుతుంటే ఈ కష్టం శత్రువుకు కూడా వద్దనుకున్నారు ఎందరో.

శ్రీలక్ష్మి తెలుగురాష్ట్రాల్లో ఈ ఐఏఎస్‌ అధికారిని పేరు తెలియనివారు లేరు. ఓబులాపురం మైనింగ్‌ కేసులో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదముద్రవేసి ఆమెకూడా నిందితుల జాబితాలో చేరిపోయారు. ఎన్నో ఏళ్లుగా నిందలు పడ్డారు. అవమానాలు ఎదుర్కున్నారు. ఏడాదిపాటు జైల్లో ఉన్నారు. ఇప్పుడా కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఓఎంసీ కేసులో ఆమెపై అభియోగాలను కొట్టేసింది. 2004-2009 మధ్యకాలంలో శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. ఓఎంసీ కేటాయింపుల విషయంలో అభియోగాలు మోపిన సీబీఐ ఆధారాలు మాత్రం సమర్పించ లేకపోయింది. దీంతో న్యాయస్థానం గనుల కేటాయింపులో ఆ మహిళా ఐఏఎస్‌ పాత్రేమీ లేదని క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది.

గాలి జనార్దన్‌రెడ్డికి మైనింగ్ లీజు విషయంలో సీబీఐ తనపై అభియోగాలు మోపినప్పటినుంచీ శ్రీలక్ష్మి న్యాయపోరాటం చేస్తున్నారు. 2022 జనవరిలో హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ శ్రీలక్ష్మి తెలంగాణ సర్వీసులోనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అలుపెరగని పోరాటంతో చివరికి అభియోగాలనుంచి బయటపడ్డారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఎస్‌గా పదోన్నతి పొందేందుకు శ్రీలక్ష్మికున్న అడ్డంకులు తొలగిపోయాయి.