ట్విటర్‌ ఉద్యోగుల సీట్లకు ఎసరెట్టేశాడు

By KTV Telugu On 8 November, 2022
image

90శాతం మంది భారతీయ ఉద్యోగులు ఔట్‌
మస్కా..మజాకా.. ఎవరినీ వదలడంలా

కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లే ఉంది ఎలాన్‌మస్క్‌ చేతిలో ట్విటర్‌ కూడా. అంత పెద్ద ప్లాట్‌ఫాంని కొద్దికొద్దిగా కొరికేస్తున్నాడు. పిచ్చిపిచ్చి ప్రయోగాలన్నీ చేసేస్తున్నాడు. పాతవాళ్ల మొహాలే చూడొద్దన్నట్లు చీటీలు చించేస్తున్నాడు. ట్విటర్‌ చేతికి రాగానే హెడ్స్‌ అందరినీ పీకేశాడు మస్క్‌. సాధారణ ఉద్యోగులకైనా భరోసా ఇస్తాడనుకుంటే ఆశ దోశ అప్పడం అంటూ అందరినీ అయోమయంలో పడేస్తున్నాడు. ట్విటర్‌లో భారీగా ఉద్యోగుల ఊస్టింగ్‌కి ఎలాన్‌మస్క్‌ తెగబడ్డాడు. అదేమంటే ఊరికే కూర్చోబెట్టి జీతాలివ్వలేనంటున్నాడు. నష్టాలు పూడ్చుకోవాలంటే మరో మార్గం లేదంటున్నాడు. ఈ పిచ్చిమారాజు చేతిలో పడ్డామే అని అంతా జుట్టు పీక్కుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విటర్‌ ఉద్యోగులంతా అభద్రతా భావంలోనే ఉన్నారు. భారత్‌లో ట్విటర్‌కి దాదాపు 200 మందికిపైగా ఉద్యోగులుంటే అందులో 90శాతం మందిపై మస్క్‌ వేటుపడింది.

ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌కు 7500మంది దాకా ఉద్యోగులంటే అందులో సగం మందికి లే ఆఫ్‌ మెయిల్స్‌ అందాయి. శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాల్లో కేంద్రాలున్న ట్విటర్‌ మస్క్‌ దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. ఓ వైపు పీకేస్తూనే మళ్లీ ఆఫీసుకు రమ్మంటూ కొందరికి మెసేజ్‌లు పంపుతూ మస్క్‌ మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడు. ట్విటర్‌లో గందరగోళంపై దాని కో ఫౌండర్‌, మాజీ సీఈవో జాక్‌ డోర్సే కూడా బాధపడుతున్నాడు. మస్క్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్విటర్‌లో ఉద్యోగాలు పోయినవారు తనని క్షమించాలన్నాడు. ఎవడైతే నాకేంటన్నట్లు ఎలాన్‌మస్క్‌ నిర్ణయాలు తీసుకుంటుంటే పాపం మాజీ సీఈవో లెంపలేసుకోవల్సి వస్తోంది. ఇప్పటికే బ్లూటిక్‌కి రేటు ఫిక్స్‌ చేసిన మస్క్‌ తానొచ్చాక కొత్త శకం ప్రారంభమైందన్నంత బిల్డప్‌ ఇచ్చేస్తున్నాడు. ఎలాన్‌ మస్క్‌ టేకోవర్‌ తరవాత యూజర్ల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగిందని ట్విటర్‌ జబ్బలు చరుచుకుంటోంది. తమ రోజువారీ యూజర్ల గ్రోత్‌ ఆల్ టైమ్ హైకి చేరుకుందని హైప్‌ క్రియేట్‌ చేసుకుంటోంది. ఇంటగెలిచి రచ్చగెలవాలన్న విషయాన్ని మస్క్‌ మరిచిపోతున్నట్లున్నాడు.