తమిళిసై గో బ్యాక్..సీపీఐ స్పీడ్ పెంచిందిగా!
రమ్మనగానే వచ్చేస్తామా. రాజ్‌భవన్‌తో తాడోపేడో
కేరళ, తమిళనాడులాగే తెలంగాణలోనూ రాజ్‌భవన్ రగడ పతాకస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొటోకాల్ విస్మరిస్తోందని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తున్నారు. ప్రగతిభవన్-రాజ్‌భవన్ మధ్య గ్యాప్మీద మొదట్లో కొన్నాళ్లు మౌనంగానే ఉన్న తమిళిసై ఈమధ్య గట్టిగా గొంతెత్తున్నారు. ఢిల్లీ టూర్ తర్వాత రాజ్‌భవన్ పవర్ చూపడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణలో యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటును తప్పుపడుతున్న గవర్నర్ దీనిపై ప్రభుత్వానికి లేఖరాశారు.
యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై సూచన చేశారు. దీనిపైనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కి కూడా లేఖరాశారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని మూడేళ్లుగా చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆ లేఖలో గవర్నర్ ప్రస్తావించారు. గవర్నర్ శ్రీముఖానికి స్పందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. గవర్నర్‌నుంచి తనకెలాంటి లేఖ అందలేదంటున్నారు విద్యాశాఖమంత్రి. దీంతో రాజ్‌భవన్-ప్రగతిభవన్ మధ్య ఈ వివాదం మరింత దూరం పెంచేలా ఉంది.
తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన ఏడు బిల్లులు గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు ముఖ్యమైంది. అయితే ఇప్పటిదాకా గవర్నర్ ఆమోదించకపోవటంతో యూనివర్సిటీల్లో నియామకాలు పెండింగ్‌లో పడ్డాయి. ఈ బిల్లుపైనే రాజభవన్‌కు వచ్చి చర్చించాలని గవర్నర్ లేఖరాశారు. కానీ ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. అసెంబ్లీ సమావేశాల్లో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో తనకు విస్తృత అధికారాలు ఉంటాయంటున్నారు గవర్నర్ తమిళిసై. తాను ఎవరికీ వ్యతిరేకం కాదంటూనే రాజ్‌భవన్‌ని తేలిగ్గా తీసుకోవద్దనే సంకేతాలు పంపుతున్నారు.
గవర్నర్ ప్రజాదర్బార్లు నిర్వహిస్తుండటం, ప్రజల్లోకి వెళ్తుండటంపై కేసీఆర్ సర్కారు కన్నెర్రచేస్తోంది. మిగిలిన విపక్షపాలిత రాష్ట్రాల్లోలా గవర్నర్‌కు ఎక్కువ అవకాశం ఇవ్వొద్దన్న వ్యూహంతో ఉన్నారు కేసీఆర్. అందుకే రాజ్‌భవన్‌ను లైట్ తీసుకుంటున్నారు. గవర్నర్ పర్యటనలను ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. ఇప్పుడు బిల్లులు పెండింగ్‌లో పెడితే గవర్నర్ వల్లే నిర్ణయాలు ముందుకు సాగడం లేదని చెప్పుకునేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమవుతోంది. విద్యార్థిసంఘాల హెచ్చరిక అందులో భాగంగానే కనిపిస్తోంది. మరోవైపు గవర్నర్ వ్యవహారశైలికి వ్యతిరేకంగా త్వరలోనే రాజ్ భవన్ ముట్టడిస్తామని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు కూనంనేని హెచ్చరిస్తున్నారు. గవర్నర్ తమిళిసై తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే కాకుండా నలువైపులనుంచీ రాజ్‌భవన్‌పై ముట్టడి పెరగబోతోంది. బీఆర్ఎస్తో బీజేపీకి తొడగొడుతున్న కేసీఆర్ రాజ్‌భవన్ పెత్తనాన్ని సహించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు.