గవర్నర్ వ్యవస్థ అపహాస్యం అవుతోంది. దారికి రాని రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బకొట్టేందుకు కేంద్రప్రభుత్వం గవర్నర్లను పావులుగా వాడుతోంది. ఐదేళ్ల పదవి కోసం గవర్నర్లు కేంద్రం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రులపై కత్తులు దూస్తున్నారు. ఇదీ నిరంతర ప్రక్రియ అవుతోంది. నిజంగా గవర్నర్లకు అంత సీన్ ఉందా అంటే మాత్రం లేదనే చెప్పక తప్పదు…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాగా క్రీయాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వృత్తి రీత్యా డాక్టర్ అయినప్పటికీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ కావడంతో ఆ అలవాట్లు మానుకోలేకపోతున్నారు. ఆమె తండ్రి కుమరీ అనంతన్ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆమె బాబాయి వసంత్… లోక్ సభ సభ్యుడిగా సేవలందించారు. పాపం తమిళిసై ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ సారి ఓడిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున తూత్తుకుడి నియోజకవర్గంలో పోటీ చేశారు.డీఎంకే అభ్యర్థి అయిన స్టాలిన్ సోదరి కణిమొళిపై బరిలోకి దిగి భంగపడ్డారు. ఇక రాజకీయాలు వద్దనుకుని..బీజేపీ అధిష్టానంతో మాట్లాడుకుని గవర్నర్ బంగ్లాలో సెటిలయ్యారు..
తమిళిసై గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. తాను తలచుకుంటే కేసీఆర్ సర్కారు ఇంటి దారి పట్టేందంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు తనకు హెలికాప్టర్ కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు సంధిస్తున్నారు. అయినా రైళ్లలోనే ప్రయాణిస్తూ… ప్రజల కోసం ప్రజల వద్దకు వస్తానంటున్నారు. ముఖ్యమంత్రి,మంత్రుల కంటే ఎక్కువగా లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు…..
రాష్ట్ర పర్యటనలు గవర్నర్ ఇష్టం. ఆమె చేస్తున్న ఆరోపణలే ఇప్పుడు చర్చనీయాంశం. రాష్ట్రానికి గవర్నర్ సుప్రీమా… ఆమె సీఎం కంటే గొప్ప వ్యక్తా…అన్నది తరచూ తలెత్తే ప్రశ్నే. రాజ్యాంగం ప్రకారం, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారమూ గవర్నర్ అధికారాలు పరిమితంగానే ఉంటాయి. గవర్నర్ సాధారణ ఉద్యోగి కాదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తికి అసాధారణ అధికారాలుంటాయని రాజ్యాంగం చెప్పినప్పటకీ.. ఆ అధికారాల వినియోగంలో విచక్షణ అవసరమని కూడా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ప్రతీ ఒక అంశానికి ఆర్టికల్ 356ని వినియోగించాలని నివేదిక పంపడం కూడా కుదరదు. గవర్నర్ కు ఎలాంటి శాసనాధికారాలుండవు ప్రభుత్వ అభ్యర్థన లేకుండా అసెంబ్లీని సమావేశ పరిచే అధికారం కూడా ఉండదని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో తేల్చిచెప్పింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైలును కూడా మొదటి సారి మాత్రమే తిప్పి పంపే వీలుంది. అదే ఫైల్ రెండో సారి ఆమె పరిశీలనకు వస్తే తప్పనిసరిగా సంతకం చేయాల్సిందే…
గవర్నర్ ఏ విధంగానూ సుప్రీమ్ కాదు.. గవర్నర్ ను బదిలీ చేయడం, తొలగించడం చాలా సులభం. రాష్ట్రపతి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే అభిశంసన తీర్మానాలు అవసరం. సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. గవర్నర్ ను పంపేందుకు అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. రెండు లైన్ల ఉత్తర్వులతో సాగనంపే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.అందుకే గవర్నర్లుగా వచ్చిన వ్యక్తులు చాలా తెలివిగా కేంద్రంలోని పెద్దల అడుగులకు మడుగులు ఒత్తుతుంటారు…
రాష్ట్ర ప్రభుత్వాలతో గవర్నర్లు గొడవ పడటం సాధారణ విషయమై పోయింది.నాడు ఇందిరాగాంధీ హయాంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాంలాల్ నుంచి నేటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ థనకర్ వరకు ఏదో వివాదం సృష్టిస్తూ…. వార్తల్లో వ్యక్తులుగానే ఉంటున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై కీచులాటలకు దిగుతున్నారు. ఎంత చేసినా వాళ్లు సాధించేదేమీ లేదు. తాత్కాలికమైన ఉపశమనం తప్ప… చివరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, వాటికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రులే.. పైచేయిగా నిలుస్తున్నారు. తెలంగాణలో కూడా అదే జరుగుతోంది… మరో పక్క గవర్నర్ వ్యవస్థనే ఎత్తివేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదీ కూడా అంత సులభం కాదు. దానికీ పెద్ద ప్రక్రియే ఉంది. అందుకే అంటారు.. It is a necessary evil…