కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో దూకుడు పెంచాయి
రాష్ట్రంలోని గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు రావడంతో ఐటీ, ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, కరీంనగర్లోని మొత్తం 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడీ దాడులు నిర్వహించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఐటీ, ఈడీ సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. గంగుల ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఆ తాళాలు పగులగొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆయన సోదరుల ఇళ్లల్లోనూ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం గంగుల తన కుటుంబంతో సహా దుబాయ్ లో ఉన్నారు. ఈడీ సోదాల నేపథ్యంలో హుటాహుటిన ఆయన కరీంనగర్ కు బయల్దేరారు. మంత్రి ఇంటితో పాటు మంకమ్మతోటలో ఉన్న కమలాకర్ చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహావీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే కరీంనగర్లోని పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో సైతం సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే తెలంగాణకు చెందిన 8 సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ దాడులు జరుగుతుండటం చర్చనీయాంశమైంది.