పవన్‌తో పరేషాన్ అవుతోన్న లోకేష్

By KTV Telugu On 10 November, 2022
image

ముందు జనసేనాని దూకుడు
లేటుగా లోకేష్ బాదుడు
ఇప్పటంలో ఎవరి మైలేజ్ ఎంత?

గత కొన్ని రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రాజకీయ రచ్చ నడుస్తోంది. విపక్షాలకు పట్టున్న ఈ గ్రామంలో రాజకీయం నివురుగప్పిన నిప్పులా మారింది. జనసేన వర్సెస్‌ వైసీపీగా సాగుతోన్న పొలిటికల్‌ ఫైట్‌లోకి టీడీపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ మంటలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. కూల్చివేతకు గురైన ఇళ్లు జనసేన, టీడీపీ సానుభూతిపరులవి కావడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. జనసేన ఆవిర్భావసభకు స్ధలం ఇచ్చినందుకు పవన్ కల్యాణ్ గ్రామానికి రూ.50లక్షల సాయం ప్రకటించారు. అయితే ఆ డబ్బు సీఆర్డీయేకు జమ చేయమని అధికారులు కోరగా ప్రజలు నిరాకరించారు. దీంతో గ్రామంలోకి జేసీబీలు ఎంట్రీ ఇచ్చాయి. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లన్నీ కూల్చేసుకుంటూ వెళ్లాయి. ఈ సమయంలో వైఎస్సార్ విగ్రహాన్ని వదిలేసి అన్ని విగ్రహాలను తొలగించడం మరో వివాదాన్ని రేపింది. పవన్ రాకతో దిగొచ్చిన ప్రభుత్వం వైఎస్సార్ విగ్రహాన్ని కూడా తీసేసింది. ఇక ఆ తర్వాత ఇప్పటం వెళ్లిన లోకేష్ బాధితులను కలిసి పరామర్శించారు. ఇళ్లను తిరిగి కట్టించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో జేసీబీ ప్రభుత్వం నడుస్తోందని అన్నీ కూలగొట్టడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని లోకేష్ విమర్శించారు.

అయితే మంగళగిరిలోని ఇప్పటంలో పవన్, లోకేష్ పర్యటనలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీలో వైసీపీపై పోరులో టీడీపీ వెనకబడిపోయిందనే మాట వినిపిస్తోంది. విశాఖ పర్యటన తర్వాత పవన్ రాజకీయం మారిపోయింది. ప్రభుత్వంపై పోరాటంలో తాను ముందువరుసలో ఉండేలా చూసుకుంటున్నారు. ఇది టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోందట. లోకేష్ తాను పోటీచేసిన, వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న మంగళగిరిలో పవన్ దూకుడు లోకేష్ ను పరేషాన్ చేస్తోందట. అక్కడ వైసీపీ,జనసేనల మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మైలేజ్ సంపాదించే ప్రయత్నాల్లో జనసేనాని ఉన్నారు. వాస్తవానికి ఇదంతా టీడీపీ చేయాల్సిన పని. అది లోకేష్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన లోకేష్ రాబోయే ఎలక్షన్ లో మాత్రం ఎలాగైనా గెలవాలని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే, పవన్ దూకుడు ముందు ఆయన వెనుకబడిపోతున్నారు. లేటుగా లోకేష్ ఇప్పటం పర్యటనకు వెళ్లారనే విమర్శలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటంలో కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈనేపథ్యంలోనే అక్కడ జనసేనాని ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఇప్పటంలో టీడీపీకి భారీగా ఓట్లు పడ్డాయి. అందుకే లోకేష్ కూడా అక్కడ వాలిపోయారు. పవన్ పర్యటనతో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన ప్రభుత్వం నారాలోకేష్ టూర్ కు ముందు మరో విగ్రహాన్ని తొలగించింది. దీన్ని తమకు అనుకూలంగా మల్చుకుంటోంది టీడీపీ. లోకేష్ కు భయపడే వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించారని తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అప్పటికే అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇళ్లు కోల్పోయినవారికి ప్రతి ఒక్కరికీ పవన్ రూ. లక్ష ఆర్థికసాయం అందించారు. అక్కడి ప్రజలు కూడా పవన్ కు పాలాభిషేకం చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇళ్లు కట్టిస్తామని చెబుతోంది. ఇలాంటి సమయంలో లోకేష్ వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదంటున్నాయి రాజకీయ వర్గాలు.